అప్పుడు కవిత ...ఇప్పుడు రోహిత్ రెడ్డి..అదే ప్లాన్ !

Update: 2022-12-19 08:03 GMT

అది సిబిఐ నోటీసు కావొచ్చు. లేకపోతే ఈడీ నోటీసు కావొచ్చు. నోటీసులు వస్తే ఆ వెంటనే సీఎం కెసిఆర్ ను కలుస్తున్నారు. అదే ప్లాన్ అమలు చేస్తున్నారు. కాకపోతే ఈ సారి ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సిబిఐ నోటీసులు అందిన తర్వాత సీఎం కెసిఆర్ తో సమావేశం అయ్యారు. తొలుత సిబిఐ కోరిన తేదిలోనే తన వివరణ ఇవ్వటానికి రెడీ అని ప్రకటించారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కెసిఆర్ తో భేటీ అయిన తర్వాత తనకు సమయం కావాలని అడిగారు. కవిత కోరిన ప్రకారం సమయం ఇచ్చి..ఆమె చెప్పిన తేదిలోనే సిబిఐ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి తాజాగా ఈడీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ను పలు రికార్డులు తీసుకొని డిసెంబర్ 19 న రావాలని అందులో కోరారు. కవిత అంటే కూతురు కాబట్టి న్యాయ నిపుణులతో మాట్లాడి కెసిఆర్ పలు సూచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ నోటీసుల విషయంలోను బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ అలాగే చేశారు. సీఎం కెసిఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే రోహిత్ రెడ్డి తో సమావేశం అయ్యారు. సోమవారం నాడు కవిత విషయంలో ఎలా జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దుర్ముహూర్తం పోయింది...బయలు దేరాను అంటూ మీడియాకి చెప్పారు.

                               కాకపోతే అయన ఈడీ ఆఫీస్ కు కాకుండా ప్రగతి భవన్ వెళ్లి సీఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు. తన ప్రతినిధితో తనకు అన్ని వివరాలతో హాజరు కావటానికి కొంత సమయం కావాలని ఈడీ ని కోరారు. అయితే ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అని చెపుతున్నారు. కవిత అంటే కూతురు కాబట్టి కొన్ని సూచనలు..జాగర్తలు చెప్పి ఉంటారని భావించారు. కానీ రోహిత్ రెడ్డి విషయానికి వస్తే ఈడీ నోటీసులు అయన వ్యాపారాలు..ఇతర లావాదేవీలకు సంబంధించి అని చెపుతున్నారు. సీఎం కెసిఆర్ మరి ఈ కేసు విషయంలో కూడా ఇంత ప్రత్యేక శ్రద్ద చూపించటం ఏమిటా అన్న చర్చ పార్టీ వర్గాలతో పాటు అధికారుల్లోనే ఉంది. కాకపోతే దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన ఫిర్యాదుదారు రోహిత్ రెడ్డి కావటం తెలిసిందే. అయితే ఈడీ మాత్రం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. నిజంగా రోహిత్ రెడ్డి సమయం కావాలనుకుంటే నోటీసు అందిన వెంటనే ఈడీ కి లేఖ రాసి ఉంటే సరిపోయేది అని..కానీ సరిగ్గా విచారణ సమయం ముందు ఇలా చేయటం వల్లే ఈడీ కూడా అయన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది అని చెపుతున్నారు. 

Tags:    

Similar News