శుక్రవారం ఉదయమే ఊహించని ఘటన. కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరు వద్ద ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఆమె పీఏ, డ్రైవర్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. లాస్య నందిత దివంగత నాయకుడు సాయన్న కుమార్తె. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి బరిలో నిలిచి విజయాన్ని దక్కించుకున్న ఆమె 37 సంవత్సరాల వయసులో కన్నుమూయటం అందరిని షాక్ కు గురిచేసింది అనే చెప్పాలి.
గత కొంత కాలంగా లాస్య నందితను వరసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొదట ఆమె ఒక లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నల్గొండ లో నిర్వహించిన కృష్ణా జలాల బహిరంగ సభకు హాజరై వస్తూ కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ అంతలోనే ఇప్పుడు ఆమె మరో ప్రమాదంలో కన్ను మూయటం అందరిని కలచివేస్తోంది. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య నందిత ఇలా అకాలమరణం చెందటం విషాదాన్ని నింపింది. గత ఏడాది ఫిబ్రవరిలోనే లాస్య తండ్రి సాయన్న మరణించారు.