తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ ఏపీలో పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితుడు ఒకరు పక్క రాష్ట్రానికి సంక్రాంతికి ఊరికి వెళ్ళాడని..అక్కడ నుంచి వచ్చాక ఫోన్ చేసి వివరాలు చెప్పాడన్నారు. 'కరెంట్ లేదు. నీళ్ళు లేవు..రోడ్లు ధ్వంసం అయ్యాయి.అక్కడ అన్యాయం..అధ్వాన్నంగా ఉంది. తిరిగి వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది. ఇక్కడ నుంచి బస్సులు పెట్టి అక్కడకు పంపండి. అప్పుడు తెలుస్తుంది మన విలువ ఏంటో. ' అని చెప్పాడన్నారు. కెటీఆర్ శుక్రవారం నాడు క్రెడాయ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో భవనాల అనుమతులకైనా..పరిశ్రమల ఏర్పాటుకు అయినా ఎలాంటి అవినీతి లేకుండా పనులు సాగుతున్నాయని..కానీ పొరుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. తాను చెప్పేది ఏదీ అతిశయోక్తి కాదన్నారు. తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం కాదు.. మీరే వెళ్లి చూడండి అన్నారు. పక్క రాష్ట్రం వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తార అని వ్యాఖ్యానించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే అన్నారు.