సోషల్ మీడియా లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతుంది. దీనికి అయన చేసిన వ్యాఖ్యలే కారణం. ‘ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించ వద్దు. లీకేజ్ అన్నది వ్యవస్థ వైఫల్యం కాదు. పేపర్ లీక్ తో నాకేమి సంబందం.’ ఇవీ మంత్రి కెటిఆర్ శనివారం నాడు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. టిఎస్ పీఎస్ సి స్వతంత్ర సంస్థ అంటూ స్పందించారు. వరసగా నాలుగు పేపర్లు లీక్ అయినా కూడా అసలు ఏ మాత్రం పట్టించుకోని టిఎస్ పీఎస్ సి, ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ అనవద్దు అన్న తరహాలో మంత్రి కెటిఆర్ మాటలు సాగాయి. ప్రశ్నలు అడిగిన మీడియా పై కూడా మంత్రి ఫైర్ అయ్యారు. అసలు పేపర్ లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ ది...అందుకు సహకారం అందించాల్సింది ప్రభుత్వం. కానీ ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారు అంటే సరిపోతుందా. ల
క్షలాది మంది నిరుదోగ్య యువత వేదన ఎంత అన్నది పట్టించుకునేది ఎవరు. పేపర్ లీక్ అంశం లో కెటిఆర్ స్పందనకు కౌంటర్ గా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్ట్ లు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కాం లో మీ చెల్లి కవిత పై ఆరోపణలు వస్తే...ఈడీ నోటీసు లు ఇస్తే మాత్రం తెలంగాణ తల వంచదు అని ప్రకటనలు చేస్తారు. అసలు తెలంగాణకు కవిత ఎదుర్కొంటున్న ఆరోపణలకు సంబందం ఏమిటి? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మీ చెల్లి లిక్కర్ దందాను తెలంగాణ అంతటికి సంబందం ఏమిటి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలపై పెను ప్రభావం చూపించే పేపర్ లీక్ విషయం మాత్రం కేవలం ఇద్దరు వ్యక్తుల తప్పు అని తప్పించుకోవటం సరికాదు అంటూ విమర్శలు చేస్తున్నారు.