తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ రైతులను అవమానించే పద్దతిలో మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఆయనకు వ్యవసాయంపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏదో చెప్పాలని ఎదో చెప్ప బోయి , మరో సారి తెలంగాణ రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. జగదీష్ రెడ్డి ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బాయిల్డ్ రైస్ కొనమని అంటున్నారని తెలిపారు. రైతులు బిజెపి పార్టీ ఆడుతున్న నాటకాన్ని గమనించాలని కోరారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని, రైతాంగం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేపు రైతు ఏ పంటకు నారుపోయాలి ఇది ముందు చెప్పండి.? ఈ దేశ ప్రజల ,రైతుల ప్రాణాలు అంటే మీకు లెక్కలేవన్నారు.
వందలాది మంది రైతులను చంపి క్షమాపణ తో సరిపెడదామనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ సోయి లేకుండా మతిస్థిమితం లేని బాధ్యతారాహిత్యంగా మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఒక్క పనికొచ్చే మాట లేదు మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ లో మాత్రమే రైతులకు రైతు బంధు ,రైతు బీమా ఇస్తున్నామని, ఈ దేశంలో మీ బిజెపి పాలిత ప్రాంతంలో ఎక్కడైనా 6వేల ధాన్యపు సేకరణ కేంద్రాలున్నాయా?తెలంగాణ లో మాత్రమే ఉన్నాయన్నారు. ఇక నుండి బండి సంజయ్ ఇష్టమచ్చినట్టు మాట్లాడుతాం అంటే కుదరదని, తెలంగాణ రైతాంగం మొన్ననే ఆయన్ను తరిమి కొట్టిందన్నారు. దేశ రైతాంగం చైతన్యం అయింది ..మీ మెడలు వంచి క్షమాపణలు చెప్పించింది అది గుర్తు పెట్టుకొని మసులుకోండని హెచ్చరించారు.