కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కొన్ని ప్యాకేజీల్లోనే ఐదు వేల కోట్ల రూపాయల వరకు మెఘాకు అనుచిత లబ్ది కలిగినట్లు కొద్ది రోజుల క్రితమే కాగ్ నిగ్గుతేల్చింది. మొత్తం ప్యాకేజీ ల విషయాలు బయటకు వస్తే ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల బాండ్స్ అంటే అధికారిక లంచాలు వంటిని అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. మెగా ఇంజనీరింగ్ ఎన్నికల బాండ్స్ ద్వారానే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మేర రాజకీయ పార్టీలకు అందచేసింది. ఇక తెరవెనక ఇచ్చే అవినీతి సొమ్ము ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక పని చేపట్టాలంటే దీనికి చాలా ముందు నుంచే కంపెనీ అంతా డిజైన్ చేస్తుంది అని...దాని ప్రకారమే ప్రభుత్వాలు..అధికారులు కూడా మెఘా ఇంజనీరింగ్ కు సహకరించిన సందర్భాలు ఎన్నో అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంటే ప్రాజెక్ట్ ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటూ వీటినే పార్టీలకు..అధికారికంగా..అనధికారికంగా ముట్టచెపుతూ మెఘా ఇంజనీరింగ్ అతి తక్కువ సమయంలో ఈ స్థాయి కి చేరింది అని చెపుతున్నారు. తెలంగాణాలో రాజకీయంగా పెద్ద దుమారం రేపిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఇంత కాలం చూసీ చూడనట్లు వదిలేయడానికి కంపెనీ అధికారికంగా , అనధికారికంగా ఇచ్చిన నిధులే అనే చర్చ కూడా రాజకీయ, అధికార వర్గాల్లో ఉంది. మొత్తానికి ఎన్నికల బాండ్స్ విషయం ద్వారా మరో సారి మెఘా విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి.