భూత‌గాదాలు లేని తెలంగాణా ల‌క్ష్యం

Update: 2021-06-02 15:39 GMT

తెలంగాణ‌లోని ప్ర‌తి అంగుళం భూమిని డిజిట‌లైజేష‌న్ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. జూన్ 11వ తేదీ నుంచి రాష్ట్రంలో భూముల డిజిట‌ల్ స‌ర్వే ప్రారంభం కానుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద 27 గ్రామాల్లో మొదటగా డిజిటల్‌ సర్వే చేపట్టనున్నారు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 3 గ్రామాల‌ను, మిగ‌తా 24 గ్రామాల‌ను 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూత‌గాదాలు లేని తెలంగాణ ల‌క్ష్యంగా డిజిట‌ల్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ట్టాదారుల భూముల‌కు శాశ్వ‌త ర‌క్ష‌ణే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఉద్ఘాటించారు. ప్ర‌జ‌ల భూమి హ‌క్కులు కాపాడేందుకే డిజిట‌ల్ స‌ర్వే చేస్తున్నామ‌ని తెలిపారు. స‌ర్వే ఏజెన్సీలు సామాజిక సేవ‌గా భావించాలి. ముందుగా వ్య‌వ‌సాయ భూముల స‌ర్వేకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సాగు భూముల త‌ర్వాత ప‌ట్టా భూముల స‌ర్వే నిర్వ‌హిస్తాం అని అన్నారు. రాష్ట్రంలోని భూముల డిజిట‌ల్ స‌ర్వే చేప‌ట్టేందుకు ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

''రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చినం. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణం లోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించండి...'' అని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు. పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తి స్తాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు.

Tags:    

Similar News