ప్రతిపక్షాలు ఏమి ప్రశ్నలు అడిగినా బుల్డోజ్ చేయటంతోపాటు ...తాము ప్రజలకు తప్ప...ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు అంటూ అప్పటి సీఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు అందరూ చూశారు. ఇక్కడ ప్రశ్నలు అడిగితే బుల్డోజ్ చేశారు..అదే పార్టీ మళ్ళీ పార్లమెంట్ విషయానికి వచ్చే సరికి తమ ఎంపీలు ఎక్కువ ప్రశ్నలు అడిగారు అని క్లెయిమ్ చేసుకోవటం...దీన్ని చూసి తమ ఎంపీలను గెలిపించాలని కోరటం విశేషం. ఇదే బిఆర్ఎస్ కేంద్రంలోని మోడీ సర్కారు కు అత్యంత కీలకమైన విషయాల్లో మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. తొలుత పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించిన కెసిఆర్ అసెంబ్లీ లో కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని మోడీ పై విమర్శలు చేయటాన్ని కూడా అంగీకరించలేదు. కేంద్రం తెచ్చిన వివాదాస్పద రైతు చట్టాలకు కూడా మద్దతు ఇచ్చి తర్వాత రివర్స్ గేర్ వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కెసిఆర్ కేంద్రంలోని మోడీ సర్కారు విషయంలో వేసిన పిల్లి మొగ్గలు ఎన్నో. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సీట్లు సాధించే ప్రయత్నాల్లో బిఆర్ఎస్ ఇప్పుడు తంటాలు పడుతోంది. లేకపోతే పార్టీలో నాయకులను నిలుపుకోవటం కష్టం అనే అభిప్రాయం నేతల్లో ఉంది. మరి లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంత మేర సత్తా చాటుతుందో వేచిచూడాల్సిందే.