అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్ నిత్యం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను విమర్శించవద్దు అని ఎవరూ చెప్పారు. కానీ కేటీఆర్ చేసే విమర్శలు అధికారం పోవటంతో కావాలని చేస్తున్నట్లు ఉంటున్నాయి తప్ప...అవి ఏ మాత్రం హేతుబద్దంగా ఉండటం లేదు అనే అభిప్రాయం కూడా పార్టీ నాయకుల్లో ఉంది. ఒక వైపు కెసిఆర్ అధికార పార్టీ కి సమయం ఇవ్వాలని బయటకు రావటం లేదు అని చెపుతూ...మరో వైపు కేటీఆర్ , హరీష్ రావు లు ప్రభుత్వం ఏ పని తలపెట్టినా కూడా నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి కెసిఆర్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్నప్పుడు అదే సూత్రం కేటీఆర్, హరీష్ రావు లకు వర్తించదా?. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు కెసిఆర్ దగ్గర నుంచి బిఆర్ఎస్ కీలక నేతలు అందరూ అప్పుడే కాంగ్రెస్ పై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది అని ..ఇక తాము అధికారంలోకి రావటమే తరువాయి అన్న చందంగా పరిస్థితి ఉంది అని ప్రచారం చేస్తున్నారు. హామీల అమలు తో పాటు పలు విషయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నే బిఆర్ఎస్ కు రాజకీయ అస్త్రాలు ఇస్తోంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
కానీ పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుని తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటంతో పాటు ..బిఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అదేమీ చేయటంలేదు అనే విమర్శలు ఉన్నాయి. అయితే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన పార్టీ లో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ప్రభావాన్ని మరింత తగ్గించటంతో పాటు తాను ఒక్కడే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగేందుకు ..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టు పెంచుకునేందుకు చేసే ప్రయత్నంలా ఉంది అనే చర్చ బిఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. కేటీఆర్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఇమేజ్ ఉంది కానీ..గ్రామీణ ప్రాంత రాజకీయాలకు అతను ఏ మాత్రం సూట్ కారు అనే ఫీలింగ్ బిఆర్ఎస్ నేతల్లోనే ఉంది...ఆ ముద్ర నుంచి బయటపడేందుకు ఇది ఒక ప్రయత్నంగా ఎంచుకునే ఛాన్స్ ఉంది అని చెపుతున్నారు. అయితే కేటీఆర్ ఎంత సీరియస్ గా ఈ పాదయాత్ర చేస్తారు..ఎంత మేర నిజంగా ప్రజల్లో మిళితం అవుతారు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. గతంలో అంటే రాష్ట్రం రాక ముందు ఉన్న సెంటిమెంట్..అప్పటి పరిస్థితులు వేరు. కానీ ఇప్పడు దగ్గర దగ్గర పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లి గతంలో చేసినట్లు అంత ఈజీగా విమర్శలు చేసే పరిస్థితి ఉండదు. అయితే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన చేసేలోగా తెలంగాణ రాజకీయాల్లో ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.