బిఆర్ఎస్ అంతటికి ఒక రూల్..కెటిఆర్ కు ఒక రూలా?!

Update: 2023-08-09 10:53 GMT

అయన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్..తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖలు చూస్తున్న మంత్రి. కొంత మంది అధికారులు...పార్టీ నేతలు చెప్పే మాట అనధికార ముఖ్యమంత్రి అని. ఇది అంతా కెటిఆర్ గురించే. ఆయన గత కొంత కాలంగా పదే పదే ఒక మాట చెపుతూ వస్తున్నారు. గతంలో కూడా ఒక సారి చెప్పారు. మళ్ళీ తాజగా కూడా అవే మాటలు రిపీట్ చేశారు. అవేంటో ముందు ఒక సారి చూద్దాం. ‘ఓట్లు అనగానే చాలా మంది పిచ్చోళ్లు మోపతైరు. మందుపోస్తరు. పైసలు పంచుతరు. నేను నా జీవితంలో మందు పోయలేదు. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మందుపోయ.. పైసలు పంచ.. మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూసుంట.. తప్పితే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం నా వల్ల కాదు’ అని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇందులో నిజానిజాల సంగతి కూడా కాసేపు పక్కన పెడదాం. కెటిఆర్ మాటలు చూస్తుంటే బిఆర్ఎస్ పార్టీలో తాను ఒక్కడిని తప్ప అందరూ మందు పోసి..డబ్బులు పంచి గెలుస్తున్నారు అనే చందంగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. అనధికారికంగా పార్టీని..ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే పార్టీ ని ఇరకాటంలోకి నెడుతుంది అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక విధానం అంటూ ఉంటే పార్టీ అంతటికి ఉండాలి కానీ...కెటిఆర్ ఒక్కరే తాను మాత్రం మందు పొయను..డబ్బులు ఇవ్వను..గెలిపిస్తే గెలిపించండి లేకపోతే లేదు అని చెప్పటం అంటే ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు అని అయన ప్రశ్నించారు.

                                        Full Viewఅసలు దేశానికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయనంతగా తెలంగాణాలో సీఎం కెసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది అని చెప్పకునే కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎవరూ మందు పోయరు ..డబ్బులు ఇవ్వరు అని చెప్పాలి కానీ...తాను ఒక్కడినే అలా చేస్తాను...మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెపితే సరిపోతుందా...మొన్నటికి మొన్న మునుగోడు ఉప ఎన్నికలో అటు బిఆర్ఎస్, బీజేపీ లు ఒక్కో ఓటు కు ఎంత ఇచ్చింది ఓటర్లు వీడియోల సాక్షిగా చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఏమి జరిగిందే తెలంగాణ ప్రజలు అందరూ చూశారు. గత ఎన్నికల ముందు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి అభ్యర్ధికి ఇంత అని పార్టీ తరపున కోట్ల రూపాయలు ఇచ్చి పంపారు అని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరిగిన విషయం కూడా తెలిసిందే. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి దక్కని రీతిలో నిధులు, స్కీములు గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట లకు వెళ్లాయని..ఇతర నియోజకవర్గాలకు కూడా అదే తరహా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే తాము కూడా కెటిఆర్ లాగా ఎన్ని మాటలు అయినా చెపుతాం అని ఒక సీనియర్ ఎమ్మెల్యే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో మందు పోయం, డబ్బులు ఇవ్వం అనేది ఒక్క కెటిఆర్ నియాజకవర్గానికే పరిమితం చేయటం కాదు...రాష్ట్రంలో బిఆర్ఎస్ అభ్యర్థులు అందరూ ఇలా చేయాలనే డిమాండ్ వస్తే బిఆర్ఎస్ బుక్ అవటం ఖాయం. రాజకీయ నాయకులు ఇలాంటి వాటి విషయంలో ఎన్ని చెప్పిన ప్రజలు వాటిని నమ్మే రోజులు పోయాయి అని మరో నేత అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News