బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి ని ప్రతిపక్ష బిఆర్ఎస్ వ్యూహాత్మకంగానే రంగంలోకి దించిందా?. బిఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో అధికార కాంగ్రెస్ పార్టీ పడిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కౌషిక్ రెడ్డి ఎలా మాట్లాడతారో అందరికి తెలిసిందే. ఆయన తెలంగాణ గత గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిలో అది పెద్ద దుమారం రేపినా కూడా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఆ విషయాన్ని చూసి చూడనట్లు వదిలేసింది. దీనికి ప్రధాన కారణం గవర్నర్ తో ఆ పార్టీ కి ఉన్న విబేధాలే. ఎన్నికల ముందు కూడా కౌషిక్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేసి తనను గెలిపించకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులంతా ఆత్మ హత్య చేసుకోవటం మినహా తనకు మరో మార్గం లేదు అంటూ ఓటర్లను ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. దీనిపై కేసు కూడా నమోదు అయింది. కారణం ఏంటో కానీ...ప్రతిపక్షంలోకి వచ్చాక సంప్రదాయాలు...పద్ధతులు...విధానాల గురించి మాట్లాడే బిఆర్ఎస్ అగ్రనేతలు ..ముఖ్యంగా కేసీఆర్ మాత్రం కౌషిక్ రెడ్డి కి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బుధవారం నాడు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి మారిన ఎమ్మెల్యేల పై ఘాటు విమర్శలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యే ల ఇళ్లకు చీరలు..గాజులు పంపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ఇటీవల పీఏసి చైర్మన్ పదవి దక్కించుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై బిఆర్ఎస్ జెండా ఎగరవేయటంతో పాటు గాంధీ మేడలో కూడా బిఆర్ఎస్ కండువా వేస్తానని ప్రకటించారు. దీంతో గురువారం ఉదయం నుంచి రాజకీయ వేడి పెరిగింది. గాంధీ ఇంటికి కౌషిక్ రెడ్డి వెళ్ళలేదు కానీ..కౌషిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి వెళ్లారు. కౌషిక్ రెడ్డి కే ఏ మాత్రం నోరు కుదరదు అనుకుంటే...అరికపూడి గాంధీ అంతకు మించి మరీ ఆయన పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో గాంధీ అనుచరులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ...ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు. బిఆర్ఎస్ కోరుకున్నది ఇదే. ఏకంగా రూలింగ్ పార్టీ కి చెందిన కార్యకర్తలు హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయటం అన్నది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామమే. దీన్ని ఎవరు సమర్ధించరు కూడా. ఇదే అదనుగా తనను చంపటానికి ఇంటికి వచ్చారు అని...ఎమ్మెల్యేలకే హైదరాబాద్ లో రక్షణ లేకపోతే ఇక ప్రజలను ఎవరు రక్షిస్తారు అంటూ కౌషిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
అంతే కాదు..తాము శుక్రవారం ప్రతిదాడి చేస్తామని...అది ఎలా ఉంటదో చూడండి అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ కౌషిక్ రెడ్డి ని రంగంలోకి దింపి ఏమి చేయాలనుకుందో అదే చేసింది. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని వాడుకుని బిఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ రెడ్డి చెడగొడుతున్నారు అని... హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకే రక్షణ లేదు అనే విమర్శలు చేయటం ఖాయం. విచిత్రం ఏమిటి గత పదేళ్ల కాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంత మందిని బిఆర్ఎస్ చేర్చుకున్నా ఆ పార్టీ నుంచి ఈ తరహా రియాక్షన్స్ లేవు. కానీ పదేళ్లు అధికారంలో ఉండి..అన్ని వనరులు ఉన్న బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటాక్ చేస్తూనే ఉంది. అయితే దీనికి కౌంటర్ ఇవ్వటంలో మాత్రం కాంగ్రెస్ ఎక్కడో ఉంటుంది అనే విమర్శలు కాంగ్రెస్ నేతల్లోనే ఉన్నాయి. పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు సంబంధించి బిఆర్ఎస్ బొక్కలు ఎన్నో ఉన్నా వాటిని వాడుకోవటం తమ పార్టీ నేతలకు చేతకాక ..ఎప్పటికప్పడు పార్టీని ఆత్మరక్షణలో పడేసే పనులు చేస్తున్నారు అనే చర్చ కాంగ్రెస్ నాయకుల్లో సాగుతోంది. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వ పరంగా..ఇటు పార్టీ పరంగా వ్యూహాత్మక తప్పిదాలు చేసుకుంటూ పోతోంది అని...రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా రాజకీయంగా నష్టం చేయటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.