అలాంటప్పుడు కెసిఆర్ టికెట్ ఎలా ఇచ్చారు

Update: 2024-09-12 09:05 GMT

జీహెచ్ఎంసి ఎన్నికల్లో కౌషిక్ రెడ్డి వ్యాఖ్యల ప్రభావం!

‘నేను నిఖార్సు అయిన తెలంగాణ బిడ్డను. గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చాడు. బ్రతకటానికి వచ్చినవాడివి. మా తెలంగాణ పవర్ చూపిస్తాం’ అంటూ పీఏసి చైర్మన్ అరికపూడి గాంధీ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మరి ఇదే గాంధీ కృష్ణా జిల్లా నుంచి బతకడానికి హైదరాబాద్ వస్తే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆయనకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు. కౌషిక్ రెడ్డి చెప్పే విషయం కెసిఆర్ కు తెలియదా..లేక అప్పటి అవసరాలు..ఆ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా వాళ్ళ ఓట్ల కోసమే ఈ పని చేశారా?. ఇప్పుడు గాంధీ బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ వైపు చూడటం మొదలు పెట్టగానే తెలంగాణ వ్యక్తికాదు అంటూ కొత్త రాగం అందుకున్నారు. అంతే కాదు మరో సారి సెంటిమెంట్ అస్త్రం రాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

                                                            పదేళ్ల తర్వాత అధికారం పోయి ఇంకా ఏడాది కూడా కాకుండానే బిఆర్ఎస్ అగ్రనేతలు అంతా ఆగమాగం అవుతున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అనే చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ ను బిఆర్ఎస్ తన రాజకీయ అవసరాల కొంత ఎంత బాగా వాడుకున్నదో..అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు..ఇతర ప్రయోజనాలు ఎవరికీ కల్పించిందో తెలంగాణా సమాజం మొత్తం చూసింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వీలు అయితే అయితే సెంటిమెంట్ అస్త్రం లేక పోతే ఏది మేలు చేస్తే ఆ రాగం అందుకోవటానికి బిఆర్ఎస్ ఏ మాత్రం వెనకాడటం లేదు. అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు త్వరలో జరగబోయే జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ఓటమి తర్వాత మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ అభిమానులకు ఏ మాత్రం మింగుడుపడలేదు.

                                                                దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన చేసిన ప్రకటన కూడా రాజకీయ రచ్చకు కారణం అయింది. అయితే మొన్నటి ఎన్నికల్లో కారణాలు ఏమైనా జీహెచ్ఎంసి పరిధిలో బిఆర్ఎస్ కు పెద్ద ఎత్తున సీట్లు రావటానికి ప్రధాన కారణాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇంటరెస్ట్స్ తో పాటు వివిధ కారణాలతో బిఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పలు కావటంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపటం ఖాయం అన్న అభిప్రాయం ఉంది. వీటికి కౌషిక్ రెడ్డి తో పాటు గతం లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత కారణం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అన్నింటి కంటే కీలకం ఏమిటి అంటే ఇన్ని సార్లు టికెట్ ఇచ్చిన అరికపూడి గాంధీ ది కృష్ణా జిల్లా అన్న విషయం కెసిఆర్ కు తెల్వదా అన్నదే ప్రశ్న. అంటే బిఆర్ఎస్ నేతలు ఏ అవసరం వస్తే ఆ రాగం అందుకుంటారు అన్నది మరో సారి నిరూపించుకున్నారు.

Tags:    

Similar News