కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి 'డ‌బుల్ గేమ్'..గెలిస్తే అటు..లేక‌పోతే ఇటే!

Update: 2022-10-12 07:59 GMT

Full Viewకాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌రే ఇంత వ‌ర‌కూ మునుగోడులో ప్ర‌చారం స్టార్ట్ చేయ‌లేదు. ఆయ‌న్ను ఎందుకు ప్ర‌చారం చేయ‌టంలేద‌ని అడిగే ప‌ని ఆ పార్టీ అధిష్టానం చేయ‌దు. ఓ వైపు తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజ‌కీయ పార్టీల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన త‌రుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌చారానికి దూరంగా ఉండ‌టానికి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చెబుతున్న కార‌ణాలు ఏ మాతం స‌హేతుకంగా లేవ‌నే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేత‌లు వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ నేత‌లు త‌న‌పై చేసిన విమ‌ర్శ‌ల బాధ‌లో ఉండి ప్ర‌చారానికి వెళ్ళ‌టంలేద‌ని వెంక‌ట‌రెడ్డి మీడియాకు చెబుతున్నారు. ఆయ‌న డిమాండ్ మేర‌కు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు..అద్దంకి ద‌యాక‌ర్ లు కూడా బ‌హిరంగంగా ఆయ‌న‌కు క్షమాప‌ణ‌లు కూడా చెప్పారు. క్షమాప‌ణ‌లు చెపితే త‌ర్వాత ప్ర‌చారం గురించి ఆలోచిస్తాన‌ని గ‌తంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించారు కూడా. కానీ ఆయ‌న ఇప్పుడు మునుగోడు బ‌రిలో ఉన్న త‌న సోద‌రుడికి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ప్ర‌చారానికి దూరంగా ఉండేలా విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. విదేశీ ప‌ర్య‌ట‌న త‌న వ్య‌క్తిగ‌తం అంటూ చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయ‌న డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌ని సొంత పార్టీ నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో బిజెపి గెలిస్తే వెంట‌నే ఆయ‌న కూడా త‌న సోద‌రుడితోపాటు బిజెపిలో చేర‌తార‌ని..కానీ బిజెపి ప‌రాజ‌యం పాలైతే మాత్రం కాంగ్రెస్ లోనే కొన‌సాగుతూ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటార‌ని..ఇదే ఆయ‌న ఆలోచ‌న‌గా పార్టీ నేత‌లు చెబుతున్నారు.

గెలిస్తే అటు..లేక‌పోతే ఇటు అన్న ప్లాన్ లో వెంక‌ట‌రెడ్డి ఉన్నార‌ని ఓ నేత వ్యాఖ్యానించారు. మునుగోడు సీటును బిజెపి ద‌క్కించుకుంటే ఆ వెంట‌నే ఎంపీ వెంట‌క‌రెడ్డి కూడా బిజెపిలో చేరితే న‌ల్ల‌గొండ జిల్లాలో ఆ పార్టీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లు అవుతుంద‌న్న‌ది క‌మ‌ల‌నాధుల ప్లాన్. ఆ ప్లాన్ ప్ర‌కార‌మే ఇది జ‌రుగుతున్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు అనుమానిస్తున్నారు. బిజెపి ప‌రాజ‌యం పాలైతే మాత్రం కాంగ్రెస్ లోనే కొన‌సాగి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా క‌దులుతార‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వ‌చ్చారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఎంపీ వెంక‌ట‌రెడ్డి కూడా ఢిల్లీలో బిజెపి అగ్ర‌నేత‌ల‌తో స‌న్నిహితంగా మెలుగుతూ వ‌స్తున్నారు. ఈ త‌రుణంలోనే వీరి కుటుంబానికి చెందిన కంపెనీకి వేల కోట్ల రూపాయ‌ల కాంట్రాక్ట్ ద‌క్క‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ దుమారం రేగిన విష‌యం తెలిసిందే. ఎవ‌రి ప్లాన్స్ ప్ర‌కారం వాళ్ళు ప‌నిచేసుకుంటూ పార్టీని దెబ్బ‌తీసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ అధిష్టానం చూస్తూ కూర్చుంటుందా..సొంత ప్లాన్స్ ఏమైనా అమ‌లు చేస్తుందా అన్న‌ది రాజ‌కీయ తెర‌పై చూడాల్సిందే.

Tags:    

Similar News