కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం ఇంకా చల్లారినట్లు కన్పించటం లేదు. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కోమటిరెడ్డితో చర్చించే బాద్యతను సీనియర్ నేత విహెచ్ కు అప్పగించింది. వీరిద్దరూ శనివారం నాడు సీఎల్పీలో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పేరు ప్రస్తావించకుండా రేవంత్ పై విమర్శలు చేస్తూ అధిష్టానంపై ప్రశంసల వర్షం కురిపించారు. మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం.. ఇప్పుడు దేవత అంటుర్రు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారుని వ్యాఖ్యానించారు. 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్య మంత్రుల పదవులు పంపకాలు చేసుకున్నారన్నారు.
తాను జిల్లా లీడర్‌ను. వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రేస్ లేదనుకుంటే 6వేల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకుంటే డిపాజిట్లు రాలేదని హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని గుర్తుచేశారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావటంలేదని, గతంలో కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో రేపటి నుంచి తానేంటో చూపిస్తానన్నారు. కాంగ్రెస్ తన ప్రాణమని పేర్కొన్నారు. ''కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడుతా. రేపటి నుంచి నేనేంటో చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం. సోనియాగాంధీ నా దేవత అని వ్యాఖ్యానించారు.