తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను తప్పుపట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంటుంది అని...వచ్చే ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని చెపుతూ వస్తున్నారు. ఈ మాట ఆయన ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. బిఆర్ఎస్ కు పదేళ్లు ఇచ్చిన విధంగానే తమకు కూడా తెలంగాణ ప్రజలు అలాగే ఛాన్స్ ఇస్తారని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నాడు మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పాటు మీ పాలమూరు బిడ్డనే సీఎంగా ఉంటాడు అని ప్రకటించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది. దీనిపై సీనియర్ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన పార్టీ లైన్ కు అనుగుణంగా లేదు అంటూ పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి ట్వీట్ సారాంశం ఇలా ఉంది. ‘ రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.’ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వలేదు అనే విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనే విషయం బహిరంగ రహస్యమే. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగివచ్చే సమయంలో తనకు ఈ మేరకు హామీ ఇచ్చారు అని ఆయన పలు మార్లు చెప్పారు. కానీ అధిష్టానం మాత్రం తాజాగా జరిగిన విస్తరణలో కూడా ఆయన కు అవకాశమే కల్పించలేదు.
ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్ లో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మంత్రి పదవులు ఎవరైనా కోరుకోవచ్చు అని...కానీ ఈ విషయాన్ని డిసైడ్ చేసేది మాత్రం అధిష్ఠానమే అంటూ చెప్తూ వస్తున్నారు. కారణాలు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి పై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి సీఎం ప్రకటనపై స్పందించి కాంగ్రెస్ లో కొత్త చర్చ కు కారకులు అయ్యారు అనే చెప్పొచ్చు. ఇది రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తోనే ఆగిపోతుందా ...దీన్ని ఇంకా ఎవరైనా అందుకుని కొనసాగిస్తారా అన్నది తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధానంగా రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి తానే పదేళ్లు సీఎం గా ఉంటానని ప్రకటించటం కూడా హాట్ టాపిక్ గా మారింది.