తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటంతో రేవంత్ రెడ్డి సర్కారు పరువు పోయింది. సోమవారం నుంచి ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశగా మారింది. వేల కోట్ల రూపాయల విలువైన ఖాజాగూడలోని 27 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు దక్కేలా చూడటంతో పాటు...అక్కడ భారీ భవనాల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై హై కోర్ట్ లో పిల్ దాఖలు చేసి ప్రభుత్వ భూమిని తప్పుడు మార్గాల్లో ప్రైవేట్ వ్యక్తులకు దక్కేలా చేయటంతో పాటు నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారు అంటూ కోర్ట్ ను ఆశ్రయించారు. అంటే వీళ్ళు అటు రెవెన్యూ శాఖతో పాటు సీఎం పర్యవేక్షణలో ఉన్న మున్సిపల్ శాఖ నిర్ణయాలను కూడా సవాల్ చేసినట్లే.
ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకొనేందునే అందుకే తాము వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోర్టు ని ఆశ్రయించినట్లు ఎమ్మెల్యేలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, కె రాజేష్ రెడ్డి, భూక్యా మురళి నాయక్ లు ఇదే అంశంపై తెలంగాణ హై కోర్టు ఆశ్రయించారు. సోమవారం నాడు ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మరో సారి అన్ని వివరాలతో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలనీ..ఈ వివరాలు తమకు సమర్పించాలని ఆదేశిస్తూ కేసు ను రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే కలకలం రేపిన ఈ వ్యవహారంపై తెర వెనక ఎవరు ఉండి ఈ కథ నడిపించారు అన్న అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు. అయితే ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెపుతున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రభుత్వ పెద్దల తీరుపై ఆ మంత్రి గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఆయన కనుసన్నల్లోనే ఇది సాగింది అని...కీలక స్థానాల్లో ఉన్న వాళ్లకు చెక్ పెట్టడానికే ఆ మంత్రి ఇంత సాహసం చేశారు చెపుతున్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు..అదీ మంత్రి వర్గంలో ప్రారంభం అయ్యాయి అని...రాబోయే రోజుల్లో ఇవి మరిన్ని మలుపులు తీసుకునే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే చాలా మంది మంత్రులు ఎవరి శాఖ వాళ్ళ సొంత రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా కీలక శాఖల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ తరుణంలో ఒక కీలక మంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయించారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది అనే చర్చ సాగుతోంది. మరి రాబోయే రోజుల్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఖాజాగూడ భూముల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే అక్కడ ఒక ప్రముఖ రియల్ ఎసెట్ సంస్థ భారీ వెంచర్ స్టార్ట్ చేసి వేగంగా నిర్మాణాలు కూడా చేస్తోంది.