‘ఔటర్ రింగు రోడ్డు’ 30 ఏళ్ళు ప్రైవేట్ కంపెనీకి ఇవ్వటం జాతీయకరణా’?!
మోడీ ని తప్పు బట్టి అదే బాటలో బిఆర్ఎస్ సర్కారు
ముందు భూములు అమ్మకం...ఇప్పుడు ఓఆర్ఆర్
ప్రధాని మోడీ విధానం ప్రవేటీకరణ. మా విధానం జాతీయకరణ. ఇది బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లు పదే పదే చెపుతున్న మాట. గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఖరీదు అయిన భూములను అమ్ముతూ పోతోంది. ఎకరాలే కాదు..గజాల లెక్కన కూడా అమ్మి ఖజానాలో జమ చేసుకొంటోంది. వీటిని వచ్చే ఎన్నికల్లో తమకు ఉపయోగ పడే ఎన్నికల పథకాలకు వాడుకొంటోంది. కానీ అంతకు ముందు ఎన్నికల్లో గెలించిందేకు ఇచ్చిన హామీల్లో కొన్నిటిని మాత్రం అసలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఎప్పటికప్పుడు గెలవటానికి కొత్త హామీలు...వాటిని అమలు చేయటానికి ప్రభుత్వ ఆస్తులు విక్రయం. అంటే ప్రజల డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నమే ఇది అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక వైపు మోడీ ప్రవేటీకరణ నిర్ణయాలను తప్పు పడుతూ తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ ను 30 ఏళ్లకు లీజ్ కు ఇచ్చేశారు. దీనికి ముద్దుగా ఆస్తుల నగదీకరణ (అసెట్ మానిటైజ్ ) అనే పేరు పెట్టారు. ఇదే పేరుతో కేంద్రంలోని మోడీ సర్కారు కూడా విమానాశ్రయాలు, రైల్వే భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు అయిన ఆస్థి. అలాంటి దాన్ని ప్రవేట్ కు అప్పగించటం ఏ మాత్రం సరికాదని...ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుంది అని ఒక ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు.
కొత్తగా కట్టే విమానాశ్రయాలు, లేదా ఇతర భారీ పీపీపీ ప్రాజెక్ట్ ల విషయంలో ఇలా చేస్తారు కానీ...ఇప్పటికి ఏర్పాటు అయి ఉన్న ఆస్థి విషయంలో కెసిఆర్ సర్కారు నిర్ణయం ఏ మాత్రం సరికాదని అయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల పథకాలకు నిధుల కొరత ఎదురుకొంటున్న సర్కారు ఈ మోడల్ ఎంచుకుంది అన్ని...ఈ టోల్, ఆపరేట్ , ట్రాన్స్ఫర్ (టిఓటి ) మోడల్ ఎన్ హెచ్ ఏ ఐ తో పాటు ఇతర విభాగాలు అనుసరిస్తున్నాయని ప్రభుత్వం చెపుతోంది. ఒక వైపు వాటిని తప్పు పట్టే కెసిఆర్, కెటిఆర్ లు మరి వాటి ఆధారంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ వరకు వస్తే మాత్రం ఏది అయిన కొత్త కొత్త థియరీ లు తెచ్చి అమ్ముతారు..ఇతరులు చేస్తే మాత్రం తప్పు పడతారు. ఇది కెసిఆర్, కెటిఆర్ ద్వంధ ప్రమాణాలు కావా అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ ను వచ్చే ముప్పై ఏళ్ళ కాలానికి ప్రవేట్ కంపెనీకి ఇచ్చేసి ఆ మొత్తం డబ్బును ఇప్పుడు సర్కారు తీసుకుని తన అవసరాలకు వద్దు కుంటుంది అన్న మాట.