తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ తొలి నినాదం స్వరాష్ట్రం..స్వపరిపాలన. రాష్ట్ర సాధన ఉద్యమంలో కెసీఆర్ తో పాటు చాలా మంది ఉద్యమకారులు..ఇతర పార్టీలు కలసి రావటంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు సీఎం కెసీఆర్ రూటు మార్చారు. స్వరాష్ట్రం..స్వపరిపాలన నుంచి కాలం కలసి వస్తే దేశ పాలన కూడా చేయాలని ఆశపడుతున్నారు. అందులో భాగంగానే జాతీయ పార్టీ పెట్టక ముందే దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ వంటి జాతీయ హామీలు ఇస్తున్నారు. దేశాన్ని ఇప్పటి వరకూ పాలించిన కాంగ్రెస్, బిజెపిలకు అసలు పాలనే చేతకాదని..తానొస్తే అద్భుతాలు చేస్తానని గత కొంత కాలంగా కెసీఆర్ చెబుతూ వస్తున్నారు. అసలు కాంగ్రెస్, బిజెపిలకు పాలన చేతనైతే ఇప్పుడు భారత్ ఇంకా చాలా ముందుకుపోయేదని చెబుతున్నారు. అమెరికా..చైనాలను చూడాలని సూచిస్తున్నారు. తమకు అవకాశం వస్తే అగ్రరాజ్యం అమెరికాను దాటేలా భారత్ ను డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నారు. వాస్తవానికి ఎవరైనా జాతీయ పార్టీ..ప్రాంతీయ పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల నేతలపై ఢిల్లీ బానిసలు..గుజరాత్ గులామ్ లు అని విమర్శించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి..జాతీయ స్థాయిలో కెసీఆర్ ఏమని చెబుతారు. దేశంలోని ఏ పార్టీలకు..నేతలకు పాలన రాదు..ఒక్క కెసీఆర్ మాత్రమే దేశానికి దారి చూపించగలరనే నినాదంతో వెళతారా?. ఓ వైపు తెలంగాణ రాష్ట్రంలోని హాస్టళ్లలో పిల్లలు పురుగుల అన్నం పెడుతున్నారని ఆందోళనలు చేస్తుంటే గత కొన్ని నెలలుగా ఈ సమస్యకు పరిష్కారం చూపటంలో కెసీఆర్ ప్రభుత్వం విఫలమవుతోంది.
తాజాగా కుని ఆపరేషన్లు వికటించి మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మన కళ్ల ముందే ఉన్నాయి. మరో వైపు సర్కారు తెచ్చిన ధరణితోటి ప్రజల సొంత భూములు కూడా వారివి కాకుండా పోయి..అధికారుల చుట్టూ తిరుగుతూ నానా కష్టాలు పడుతున్నారు.