బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు, అయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ పై ఎంత ప్రత్యేక ప్రేమ ఉందో వాళ్ళ మాటలను చూస్తేనే తెలిసిపోతుంది. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కెసిఆర్ పలు మార్లు గత కాంగ్రెస్ హయాంలో హౌజింగ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు వేల కోట్ల రూపాయల స్కాం చేశారని..ఆయనపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.పలు బహిరంగ సభల్లోనే ఆయన ఈ మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఐదేళ్లలో పాలనపై దృష్టి పెట్టమని...రెండవ టర్మ్ లో చర్యలు ఉంటాయని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే అన్ని టర్మ్ లో అయిపోయియి....నో యాక్షన్. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటిలో కెసిఆర్ ఈ విమర్శలు చేసినట్లు స్పష్టం అయింది. ఈ స్కాం ను అడ్డంపెట్టుకుని కూడా బిఆర్ఎస్ ఎన్నికల ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నం చేసినట్లు గతంలో కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కెసిఆర్ తనయుడు కేటీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు అనే విషయం తాజాగా ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో జలవనరుల శాఖతో పాటు పౌర సరఫరాల శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బియ్యం టెండర్ల కుంభకోణంపై సభా సంఘానికి బిఆర్ఎస్ డిమాండ్ చేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నో చెప్పింది.
కానీ ఇక్కడ అసలు సంగతి ఏంటి అంటే సభా సంఘానికి డిమాండ్ చేసిన బిఆర్ఎస్ అదేమీ కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఈ స్కాంలో మంత్రి పాత్ర లేదు అని కేటీఆర్ సర్టిఫికెట్ ఇస్తూనే ..ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది అని ఆరోపించడం...అంతా ఒక ఎజెండా ప్రకారమే సాగింది అనే చర్చ తెరమీదకు వచ్చింది. సభా సంఘం వేయకుండానే..అసలు విచారణ మొదలు కాకముందే కేటీఆర్ ఒక వైపు మంత్రికి క్లీన్ చిట్ ఇస్తూ..ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది అనే వ్యాఖలు చేశారు అంటే కేటీఆర్ టార్గెట్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు నిజంగా పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల రూపాయల స్కాం జరిగిందా లేదా అన్నది తేలాలంటే దీనికి సంబధించిన ఫైల్స్..మంత్రి వర్గ నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా అనే రికార్డు లు చూస్తే తప్ప తేలదు. కానీ ఇదేమి లేకుండానే కేటీఆర్ సభలో మాట్లాడుతూ మంత్రికి సర్టిఫికెట్ ఇస్తూ విచారణ డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ ని తోసిపుచ్చడంతో బిఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఈ వ్యవహారాలు అన్ని చూస్తున్న వాళ్ళు మాత్రం అప్పుడు కెసిఆర్, ఇప్పుడు కేటీఆర్ లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది అని వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనక ఉన్న కారణాలపై కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.