కేంద్రం అవినీతి చిట్టా నా దగ్గరుంది
మోడీ, నడ్డా ఇదేనా మీ సంస్కారం?
అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి
అహంకారమా..కళ్లునెత్తినెక్కాయా
కెసీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ శనివారం నాడు మరోసారి ప్రధాని మోడీ, కేంద్ర సర్కారుపై ధ్వజమెత్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాహుల్ గాంధీని మీరు ఏ తండ్రికి పుట్టారని మేం అడిగామా అంటూ అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కెసీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ తో తమకు సంబంధం లేకపోయినా ఓ ఎంపీగా ఉన్న వ్యక్తి, ఓ నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటని మండిపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని కెసీఆర్ డిమాండ్ చేశారు. దేనికైనా హద్దులుంటాయని..అహంకారమా..కళ్లు నెత్తికెక్కాయా అని ప్రశ్నించారు. ఇదేనా మీ బిజెపి సంస్కారం..భాష అంటూ ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి ప్రెసిడెంట్ నడ్డా లను నిలదీశారు. హిందూదర్మం ఇదేనా అని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పార్టీకి ఇది పద్దతా అన్నారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలు విని తనకు కళ్లవెంట నీళ్లు వచ్చాయన్నారు. శనివారం నాడు యాదాద్రి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం కెసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ''మోదీ, దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, మతపిచ్చి.. ఇదే బీజేపీ సిద్ధాంతం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలి. మోదీ చేతగానితనం వల్లే దేశంలో కరెంట్ కోతలు, నీళ్ల తగాదాలు వస్తున్నాయి. ' అని కేసీఆర్ ప్రకటించారు. తాను శుక్రవారం నాడు మాట్లాడిన మాటలతో బిజెపి వాళ్ళ లాగులు తడిచాయన్నారు. తానేమీ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం నుంచి మోడీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి తన ఎనిమిదేళ్ళ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. బిజెపి నేతలు కేసీఆర్ సంగతి చూస్తా అంటే ఇక్కడ ఎవడూ భయపడడు అని వ్యాఖ్యానించారు. హిజాబ్ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మతపిచ్చి లేపి కర్ణాటక లో ఆడపడుచులను ఆగం చేస్తున్నారన్నారు. బిజెపి వాళ్ళు కుక్కల లెక్క అరవడం మానాలని, పొద్దున లేస్తే కర్ఫ్యూలు- ఘర్షణలు అవసరమా అని ప్రశ్నించారు.
సాఫ్ట్ వేర్ రంగానికి బెంగుళూరు భారతీయ సిలికాన్ వ్యాలీ లాంటిదని..అక్కడ మత ఘర్షణలు లేపితే ఎవరు వస్తారని ప్రశ్నించారు. సిలికాన్ వ్యాలీని కాశ్మీర్ వ్యాలీగా మారుస్తారా అని ప్రశ్నించారు. శాంతి, భద్రతలు ఎక్కడ ఉంటేనే అక్కడకు పెట్టుబడులు వస్తాయన్నారు. మోడీ హయంలో దేశంలో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. అమెరికాలో ఈ మత పిచ్చి ఉండదన్నారు. కేంద్రం అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ ఠాక్రేలు మాట్లాడారని తెలిపారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె ఈ బిజెపి అంటూ మండిపడ్డారు. బిజెపిని ఎంత త్వరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచి జరుగుతుందని అన్నారు. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో బిజెపి బాగోతాలు చెబుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.