బిఆర్ఎస్ పై కవిత బాంబ్

Update: 2025-05-29 09:27 GMT

రాజకీయం అంటే ట్విట్టర్ లో ట్వీట్స్ చేయటం కాదు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఆయన చెల్లి, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు. ఇంత కాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..కేంద్ర మంత్రి బండి సంజయ్ లు మాత్రమే కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లు అంటూ విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడు కవిత ఆ పదం వాడకపోయినా ..అదే అర్ధం వచ్చేలా కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నట్లు బిఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయటం కాదు ఏకంగా బిఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేసే కుట్ర జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

                                                      తాను ఉంటే ఇది సాధ్యం కాదు అని..తనను కెసిఆర్ కు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు కవిత. తాను జైలు లో ఉన్నప్పుడే బీజేపీ లో విలీనం చేసే కుట్ర జరగ్గా తాను అందుకు నో చెప్పానన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా కలకలం మొదలైన విషయం తెలిసిందే. తర్వాత నిత్యం కవితపై మీడియా లో ఏదో ఒక వార్తలు వస్తుండంతో ఆమె గురువారం నాడు చిట్ చాట్ నిర్వహించారు. ఇందులోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న కేటీఆర్ పై ఘాటుగానే స్పందించారు. కవిత మాటలు ఆమె వ్యాఖ్యల్లోనే...‘ ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా.? .నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది!. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నా. కెసిఆర్ వద్దు అని వారించారు. లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు..!. నాజోలికి వస్తే బాగుండదు..కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు. పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు!. నా లేఖ లీక్‌ చేసిందెవరో చెప్పాల్సిందే.

                                             కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు..ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా..?. నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా. పార్టీచేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదు. బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ ఒక్కరే నాయకుడు..పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను. కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు. నాకు, కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోంది. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు’ అంటూ కవిత మాట్లాడారు. దీంతో మరో సారి బిఆర్ఎస్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

Tags:    

Similar News