హిమాన్షు మాటలు ఎలా అర్ధం చేసుకోవాలి!

Update: 2023-07-12 11:26 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు, మంత్రి కెటిఆర్ కొడుకు హిమాన్షు ఒక మంచి పని చేశాడు. స్నేహితులతో కలిసి రెండు ఈవెంట్స్ చేసి నలభై లక్షల రూపాయలు సమీకరించారు. తర్వాత కొంత మంది నుంచి సిఎస్ఆర్ నిధులు సమీకరించి గౌలిదొడ్డి లోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఆధునీకరించిన పాఠశాలను హిమాన్షు బుధవారం నాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ పనులు చేయటానికి తనకు స్ఫూర్తి తాత సీఎం కెసిఆర్, తండ్రి కెటిఆర్ లే అని చెప్పారు. వారి ప్రోత్సహంతోనే ఇది సాధ్యం అయింది అని తెలిపారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ హిమాన్షు తన స్పీచ్ లో చెప్పిన మాటలు చూస్తే మాత్రం పరిస్థితి మరోలాగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తొలిసారి కేశవ్ నగర్ పాఠశాలకు వచ్చినప్పుడు తన కళ్ళ వెంట నీళ్లు వచ్చాయని...ఆడ పిల్లలకు సరైన బాత్ రూమ్ లు లేవని, స్కూల్లో మెట్లు కూడా సరిగా లేవు అన్నారు. అలాంటి పరిస్థితులను తాను ఎప్పుడూ చూడలేదు అన్నారు హిమాన్షు. స్కూల్ హెడ్ మాస్టర్ కు రూమ్ లేదు అని...అయన రూమ్ లో కూడా క్లాస్ లు జరుగుతున్నాయని,,,స్టోర్ రూమ్ గా వాడుతున్నారు అని చెప్పారు.

                                   అప్పుడే స్కూల్ కు కేవలం గోడలు కట్టి వదిలేయటం కాదు...మొత్తం మార్పులు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేసినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది అన్నారు. అయితే గత తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్నది సీఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ సర్కారే. అద్భుతాలు సంగతి కాసేపు పక్కన పెడితే పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో విఫలం అయింది అనే విషయాన్ని హిమాన్షు తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు అనే చర్చ సాగుతోంది. ఒకే వైపు సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు విద్య రంగంతో పాటు తాము పలు రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దాం అని చెపుతుంటే రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గర ఉన్న స్కూల్ చూసి సీఎం మనవడు, మంత్రి కెటిఆర్ తనయుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటే అది ఎవరి వైఫల్యం కిందకు వస్తుంది. హిమాన్షు ఇక్కడ అంటే చేశారు...అమ్మాయిలకు సరైన టాయిలెట్స్ లేని స్కూల్స్ అటు ఆదిలాబాద్ దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ శివార్లలో కూడా ఎన్నో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి హిమాన్షు ఒక మంచి పని చేసినా వాస్తవాలు చెప్పి సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ పరువు తీసినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News