జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సానుకూలతలు ఎన్నో!

Update: 2025-11-08 10:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జోష్ నిస్తుందా?. లేక కుదుపునకు గురి చేస్తుందా?. ఈ వ్యవహారం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఎన్నో సానుకూలతలు ఉన్నా కూడా ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయాన్ని దక్కించుకోలేకపోతే రాజకీయంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండవ ఉప ఎన్నిక ఇది. ఈ రెండు ఉప ఎన్నికలు కూడా బిఆర్ఎస్ సభ్యుల అకాల మరణాల వల్ల వచ్చినవే. ఇందులో ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయితే..ఇప్పుడు జరుగుతున్నది రెండవది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ నెల పదకొండున జరగనున్న విషయం తెలిసిందే. కంటోన్మెంట్ లో అయితే ఎలాంటి హంగామా లేకుండా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పదమూడు వేలకు పైగా మెజారిటీ తో విజయం సాధించారు.

                                                 ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జరిగినా కూడా అక్కడ సెంటి మెంట్ వర్క్ అవుట్ కాలేదు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరికొద్ది రోజుల్లోనే రెండేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో దీనికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. అందుకే ఈ సీటు గెలుచుకుని తమ ప్రభుత్వానికి ప్రజల ఆమోదం పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సర్వశక్తులు ఒడ్డుతుంటే ..మరో వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా తన సిట్టింగ్ సీటు ను కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కూడా రేస్ లో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ల మధ్య మాత్రమే అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 14 న రానున్న ఈ ఉప ఎన్నిక ఫలితాలపైనే ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి..అయన క్యాబినెట్ లోని మంత్రుల మధ్య బాగా గ్యాప్ ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అధికారంలోకి వచ్చి రెండుళ్లు అవుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి కి ప్రభుత్వంపై పూర్తి స్థాయి కంట్రోల్ రాలేదు అనే చర్చ ఆ పార్టీ నేతల్లో ఉంది.

                                                      ఇందుకు వాళ్ళు ప్రధానంగా చెపుతున్న కారణం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సంబంధించి బయటకు వచ్చిన పలు సర్వేల విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో పేరున్న మీడియా సంస్థల సర్వేలకే ఇప్పుడు క్రెడిబిలిటీ లేకుండా పోయింది అని..కానీ చిన్న చిన్న సంస్థలు చేసిన సర్వేలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకోవటంలో బిఆర్ఎస్ ముందు వరసలో ఉంది అన్నది వీళ్ళ వాదన. అధికారంలో ఉన్న పార్టీ ..కనీసం ప్రతిపక్షం చేస్తున్న తెర వెనక ఆపరేషన్ ను కూడా గుర్తించకపోతే ఎలా అని ఒక సీనియర్ మంత్రి ప్రశ్నించారు. అయితే మరో మూడేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండనుండటం...కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సామాజిక వర్గం మద్దదు..ఈ ఎన్నికల బరిలో నిలవకుండా కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ చేస్తుండం వంటివి అధికార కాంగ్రెస్ పార్టీ కి సానుకూల అంశాలు.

                                                       వీటితో పాటు అధికారంలో ఉండటం కలిసి వచ్చే అంశం...ఆర్థిక వనరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ని సానుకూల అంశాలు ఉండి కూడా అధికార పార్టీ ఈ సీటు ను దక్కించుకోలేకపోతే అది రేవంత్ రెడ్డి కి మరింత ఇబ్బంది కరంగా మారుతుంది అని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత బహుశా ఎవరూ తిరగని రీతిలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ప్రచారంలో ఆయన తన ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు చూసిన వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పు తున్నట్లు ఉంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో వైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సి ఉండటంతో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక ఫలితం ఎంతో కొంత వాటిపై పడటం ఖాయం అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్క సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా క్యాబినెట్ లోని కీలక మంత్రులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో భాగం అవుతున్నారు..పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కొంత మంది మంత్రులు మాత్రం ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి కి మరింత బలోపేతం అవుతాడు అని కారణంతో అంత సీరియస్ గా పనిచేయటం లేదు అనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అందరి కంటే ఈ ఉప ఎన్నిక ఫలితం రేవంత్ రెడ్డి కే ఎంతో కీలకం అని చెప్పొచ్చు.

Tags:    

Similar News