హైదరాబాద్ లో వేలాది మంది జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి గత ఏడాది అగస్ట్ లో సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తో పాటు జర్నలిస్ట్ నాయకుడు, ఎమ్మెల్యే క్రాంతి మరికొంత మంది జర్నలిస్ట్ నాయకులు సీఎం కెసిఆర్ ఫోటో కు పాలాభిషేకం చేశారు. ఆ సమయంలో సీఎం కెసిఆర్ కృషి వల్లే ఇది సాధ్యం అయింది అంటూ ప్రకటనలు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కెసిఆర్ పాటు పడుతున్నారు అని కొనియాడారు. ఇది జరిగి ఎనిమిది నెలలు కావస్తుంది. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద కెసిఆర్ కు పాలాభిషేకం అయితే చేశారు కానీ..ఇప్పటి వరకు ఈ అంశం లో అడుగు ముందుకు పడలేదు. దీంతో జర్నలిస్ట్ లు పాలాభిషేకాలు అయితే చేశారు కానీ ...పని సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సుప్రీం తీర్పు వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా సొసైటీ కి సమయం ఇప్పించటం కానీ...లేక పోతే నేరుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం కోసం అడుగు ముందుకు పడలేదు. ఒక సారి ఢిల్లీ లో అల్లం నారాయణ క్రాంతి తదితరులు సీఎం కెసిఆర్ తో సమావేశం అయినా కూడా దీనిపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క స్పష్టమైన ప్రకటన రాలేదు.
కొద్దిరోజుల క్రితం అనధికారికంగా అల్లం నారాయణ దీనిపై కొంత కసరత్తు చేసినా దీనిపై కూడా సర్కారు ఇంతవరకు స్పందించలేదు. తీర్పు పెండింగ్ లో ఉన్నత కాలం అది క్లియర్ అయినా వెంటనే పని చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కెసిఆర్ ఇప్పుడు అసలు అది ఏంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన టియుడబ్ల్యుజె నేతలతో కానీ..ఇటు ప్రెస్ అకాడమీ కి...లేదంటే సొసైటీ కి ఏ మాత్రం సమయం ఇవ్వటం లేదు కెసిఆర్ . మైక్ ల ముందు మాత్రం జర్నలిస్టుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటనలు అయితే చేస్తారు. కానీ ఎప్పుడో పద్నాలుగు ఏళ్ళ క్రితం అలాట్ అయినా భూమి విషయం లో నిర్ణయం తీసుకోవటం లేదు..కొత్త వారి విషయంలోనే అదే నాన్చుడు ధోరణి చూపిస్తున్నారు. తెలంగాణ లో త్వరలోనే ఎన్నికలు ఉండటం తో అసలు ఈ విషయం ఎప్పుడు తేలుతుందో తెలియని అనిశ్చితిలో జర్నలిస్టులు ఉన్నారు.