ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు
అడ్మిషన్లు తగ్గుతున్నాయి..డిశ్చార్జ్ లు పెరుగుతున్నాయ్
తెలంగాణ సీఎం కెసీఆర్
కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కెసీఆర్ కోరారు. సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ 533, జనరల్ బెడ్స్ 4,140 ఖాళీ ఉన్నాయని సీఎం వివరించారు. తెలంగాణ లో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. వైద్యం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ఒక్కటే అయినందున కోవిడ్ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం ప్రజలను కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సినేషన్ కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెప్పించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని, కోవాక్సిన్, కోవిషీల్డ్ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసులు స్టాకు ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. అందులో కోవాక్సిన్ 58,230, మరియు కోవిషీల్డ్ 1,28,550 డోసులు స్టాకు ఉందని ముఖ్యమంత్రికి వివరించారు.
మొత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ లలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లు కేటాయించే విషయంతోపాటు, నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం జీవో నంబర్ 248 విడుదల చేసిందని అన్నారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషంట్లే తమ బిల్లులు చెల్లిస్తున్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని అధికారులు వివరించారు.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆసుపత్రిని తక్షణమే కోవిడ్ చికిత్సకు ఉపయోగించాలని, సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్ఎఫ్, సీఆర్.పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కోవిడ్ సేవలు అందించడానికి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు లాక్ డౌన్, జ్వర సర్వే, కోవిడ్ కిట్ల పంపిణీ తదితర కారణాల వల్ల కోవిడ్ అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం సంతోషకరమని సీఎం అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి అన్నారు. జ్వర సర్వేలో లక్షణాలు గుర్తించిన వారిని వైద్య బృందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుంటూ ఉండాలని సీఎం సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.