కీలక పరిణామం. గెలిచిన..గెలిపించిన ప్యానల్ కు వెన్నుపోటు పొడిచి అక్రమార్కుల వైపు నిలిచిన ప్రస్తుత కార్యదర్శి మురళీ ముకుంద్ పై వేటుపడింది. కొద్ది రోజుల క్రితమే ఆయనపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఈ రోజు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో 15 మంది సభ్యులకు గాను 12 మంది సభ్యులు మురళి కి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆయనను కార్యదర్శి పదవినుంచి తొలగించారు. ఈ అవిశ్వాస తీర్మానం ఆపేందుకు హై కోర్టు, ట్రిబ్యునల్ ను ఆశ్రయించినా వీరికి ఉపశమనం లబించలేదని సొసైటీ వర్గాలు తెలిపాయి. దీంతో కమిటీలో ఇప్పటివరకూ గత కమిటీలో అక్రమాలకు అండగా నిలిచిన వారికి చెక్ పడినట్లు అయింది.
గత పదిహేను సంవత్సరాలుగా జూబ్లిహిల్స్ సొసైటీలో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్ర చౌదరి, కార్యదర్శి హనుమంతరావుల అక్రమాలు ఇప్పుడు ఇక పూర్తిగా వెలుగులోకి రావటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి జాబితా అంతా సిద్ధం అయింది. మరి సెక్రటరీని తప్పించిన తర్వాత అయినా ఇంకా సొసైటీ కార్యకలాపాలు సాఫీగా సాగుతాయా? లేక ప్రభుత్వంలో ఉన్న అండతో తమ అక్రమాలు వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ తొలగింపుతో అసలు కథ ఇక ఇప్పటినుంచే ప్రారంభం కానుంది. కొత్త కమిటీ ఇప్పటికే గత కమిటీ అక్రమాలకు సంబధించిన ఫోరెన్సిక్ ఆడిట్ కు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.