షాకింగ్. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వంద కోట్ల రూపాయల నగదు. హెటిరోలో సాగిన ఐటి దాడుల్లో వెలుగుచూసిన మొత్తం.దీంతోపాటు పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎలక్ట్రానిక్ డేటా ను సమగ్రంగా పరిశీలించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. హెటిరో కార్పొరేట్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు భారీగా నగదు గుర్తించటంతోపాటు పన్ను చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. విదేశాల నుంచి హెటిరో పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డులు చూపించారు. ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలున్నట్లు, విలువ తక్కువ చేసి ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు తేల్చారు.
మెడిసిన్ తయారు చేస్తున్న కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు. శనివారం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కరోనాకు సంబంధించిన మందుల తయారీలో కూడా ఈ సంస్థ నిమగ్నమై ఉన్న విషయం తెలిసిందే. వంద కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుపై ఉన్న బ్యాంకు సీల్స్ ఆధారంగా ఎప్పుడెప్పుడు..ఎంత నగదు డ్రా చేశారు.. ఇది ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే హెటిరో డ్రగ్స్ పై ఐటి దాడులకు సంబంధించి ఐటి శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.