మొన్న కాళేశ్వరం...ఇప్పుడు సుంకిశాల

Update: 2024-08-09 04:59 GMT

అధికారంలోకి వచ్చిన కొత్తలో కెసిఆర్ పదే పదే పునర్నిర్మాణం గురించి చెప్పేవాళ్ళు. కానీ ఆయన చేసిన పునర్నిర్మాణం ఏంటో కానీ..ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే పదేళ్ల కాలంలో కెసిఆర్ కట్టిన ప్రాజెక్ట్ లు అన్ని మళ్ళీ కట్టడమో...లేకపోతే వందలు... వేల కోట్ల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించటమో చేయక తప్పని సరి పరిస్థితి కనిపిస్తోంది. లక్ష కోట్ల రూపాయలకుపైగా వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందే ఇప్పుడు కళ్ళ ముందే ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ ను తిరిగి గాడిన పెట్టాలంటే తిరిగి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందో ఇప్పటికీ ఇంకా లెక్కలు తేలలేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంతో కీలకం అయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకం మారిన సంగతి తెలిసిందే. ఎన్ డీఎస్ఏ తుది నివేదిక ప్రకారమే ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళతాం అని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్న విషయం తెలిసిందే. ఒక వైపు కాళేశ్వరం సంగతి ఇలా ఉంటే ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్ట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుంకిశాల ప్రాజెక్ట్ లో సేఫ్టీ వాల్ కూలిపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చి..అంచనాలు పెంచింది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వమే.

                                                                                     తొలుత ఈ ప్రాజెక్ట్ కు 1450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మేఘా ఇంజనీరింగ్ కు కట్టబెట్టారు. తర్వాత ఈ అంచనాను 2214 కోట్ల రూపాయలకు పెంచారు. అంటే ఏకంగా 764 కోట్ల రూపాయల మేర అంచనాలు పెంచారు. దీనికి కారణం ఫార్మా సిటీ కి అవసరమైన నీళ్ల కోసం అని చెపుతున్నా కూడా...ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడు అన్ని అంచనాలతోనే కదా ప్రతిపాదనలు సిద్ధం చేసేది. మేఘా ఇంజనీరింగ్ కు గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టబెట్టిన ప్రాజెక్టు లు అన్నింట్లోనూ అంచనాలు అడ్డగోలుగా పెంచినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్ట్ లే కాదు...కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా చేపట్టిన యాదాద్రి దేవాలయం పనుల్లో డొల్లతనం కూడా కట్టిన కొన్ని రోజులకు వచ్చిన భారీ వర్షాలకే బయటపడింది. ఇవన్నీ చూస్తుంటే కెసిఆర్ చేసిన పునర్ నిర్మాణం సంగతి ఏమో కానీ..ఆయన హయాంలో కట్టిన ప్రాజెక్ట్ లు అన్నింట్లో మాత్రం మళ్ళీ నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి కనపడుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News