బలహీన సీఎంగా మిగలబోతున్నారా?!

Update: 2025-10-23 11:30 GMT

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతాలు చేస్తుంది అనే దాని కంటే కూడా ముఖ్యంగా అప్పటి సీఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మీద వ్యతిరేకత తోనే కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది అని చెప్పొచ్చు. దీనికి తోడు ఎన్నికల ముందు అప్పటి పీసీసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు కూడా పార్టీకి బాగానే ఉపయోగపడింది. ఇంత చేసినా కుడా బొటాబొటీ మెజార్టీతోనే కాంగ్రెస్ బయటపడింది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ...సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ ఇక అంతే....ఆ పార్టీ జీవితంలోఇక మారదు అనే అభిప్రాయం కలుగుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                                                  రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోని మంత్రుల మధ్య ఏ మాత్రం సయోధ్య ఉన్నట్లు కనిపించదు...ఎమ్మెల్యే ల తీరు ఎవరిష్టం వాళ్లదే అన్నట్లు సాగుతోంది. మొత్తంగా వెరసి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అటు క్యాబినెట్ పై...ఇటు ఎమ్మెల్యే లపై ఏ మాత్రం పట్టు లేదు అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూసి ఎన్నికల ముందు ఎంతో బలవంతుడుగా కనిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత బలహీనమైన సీఎం గా కనిపిస్తున్నాడు అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ పై వచ్చిన ఆరోపణలు నిజమా లేదా అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే. అయితే ఒక మంత్రి ఇంటికి ఓఎస్డీ కోసం పోలీసులను ఏ ప్రభుత్వం అయినా పంపుతుందా? ఏ మాత్రం అయినా పాలన తెలిసిన వాళ్ళు చేసే పనేనా ఇది అని ఒక మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. పోలీస్ లు ఆ ఓఎస్డీ ని అదుపులోకి తీసుకోవాలంటే ఇంతకంటే వేరే మార్గంలేదా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన ఫ్యామిలీపై చేసిన విమర్శలు కాంగ్రెస్ నేతలను కూడా షాక్ కు గురి చేశాయి.

                                               ఇది జరిగిన వెంటనే మళ్ళీ కొండా సురేఖ దంపతులు పీసీసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కావటంతో సీఎం వాళ్ళతో రాజీకి వచ్చాడు అనే అభిప్రాయాలు కలిగించటానికి కారణం అయ్యాయి అనే చర్చ తెర మీదకు వచ్చింది. దగ్గర దగ్గర రెండేళ్ల పాలన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్షలో ఐఏఎస్ అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది అంతా కూడా రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం..పరిపాలనపై ఏ మాత్రం పట్టు సాధించలేదు అనే సంకేతాలను ప్రజల్లోకి పంపినట్లు అవుతుంది అనే అభిప్రాయాన్ని మంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం..మంత్రికి తెలియకుండా ఒక ఐఏఎస్ అధికారి సొంతంగా నిర్ణయం తీసుకుంటే ఒక్కరిపై వేటు వేస్తే తిరిగి ఎవరిపైన మళ్ళీ అలాంటి పని చేయగలరా అని ఒక అధికారి ప్రశ్నించారు.

                                              తప్పులు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ప్రభుత్వ పరువు పోవటం తప్ప మరొకటి ఉండదు అని చెపుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వికి నిజాయతీ పరుడు అయిన అధికారిగా పేరు ఉంది. ఆయన ఇప్పటికే పలు మార్లు బదిలీ అయ్యారు. దీనికి కారణం పలు చోట్ల మంత్రులు చెప్పిన పనులు చేయకపోవటమే అనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఎవరిపై అయితే తీవ్రమైన విమర్శలు..అవినీతి ఆరోపణలు చేశారో అలాంటి ఐఏఎస్ అధికారులు అందరూ ఇప్పుడు కీలక పదవుల్లో కొనసాగుతుంటే ..నిజాయతీపరుడుగా పేరున్న అధికారి మాత్రం విఆర్ఎస్ తీసుకుని బయటకు వెళ్లాలని నిర్ణయించుకోవటం ఇప్పుడు పెద్ద కలకాలంగా మారింది. నిజంగా రిజ్వి తప్పు చేసి ఉంటే ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ పరిణామం మాత్రం ప్రభుత్వ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేదే అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News