డబల్ బెడ్ ఇళ్ళు..పేదలకు పట్టాల విషయంలో ఈ స్పీడ్ ఎక్కడ?

Update: 2023-06-05 03:51 GMT

తెలంగాణ భవన్, భారత్ భవన్ ..ఇంకెన్ని భవనాలు కట్టుకుంటారో

ఓడిపోయినా కోకాపేట భూమి పోకుండానే భారత్ భవన్ నిర్మాణం!

డబల్ బెడ్ ఇళ్ళు..పేదలకు పట్టాల విషయంలో ఈ స్పీడ్ ఎక్కడ?

మళ్ళీ గెలుస్తామో లేదో అన్న భయం ఉన్నప్పుడు కొంత మంది రాజకీయ నాయకులు ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చేరిపోయారను ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అలా బిఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవటం...ఇలా కెసిఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ దగ్గర దగ్గర 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఏకంగా 11 ఎకరాలు కోకాపేటలో ఆ పార్టీ కి కేటాయించారు. అదే స్పీడ్ లో ఇప్పుడు బిఆర్ఎస్ అధినేత ఈ కోకాపేట స్థలంలో పదిహేను అంతస్తుల భారత్ భవన్ కు శంఖుస్థాపన చేయనున్నారు. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’, ‘హ్యుమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ కేంద్రం కోసం అని స్థలం తీసుకుని ఇప్పుడు అక్కడ భారత్ భవన్ పేరుతో నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. పేరు ఏదైనా కూడా ఇది ఖరీదు అయినా..కోట్ల రూపాయల విలువ చేసే స్థలం చేజారకుండా చేసుకునే ప్రయత్నమే అనే చర్చ సాగుతోంది. అసలు ఒక శిక్షణ కేంద్రానికి ఇంత భారీ ఎత్తున భూమి అవసరం ఏమి ఉంది అని ఒక ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. పేదలకు డబల్ బెడ్ రూమ్ నిర్మాణంలో కానీ...పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కానీ మరే ఇతర కార్యక్రమాల్లో ఇంత స్పీడ్ గా పని జరగలేదు.

                               కోకాపేట లో భూమి కేటాయింపు...ఇప్పుడు భవన నిర్మాణానికి శంఖుస్థాపన స్పీడ్ మాత్రం అసాధారణం అని చెప్పొచ్చు.. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే బిఆర్ఎస్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అయినా కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క సారి అంటే ఒక్కసారి కూడా పార్టీ నాయకులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయలేదు అని..ఇది అంతా కేవలం ప్రభుత్వం నుంచి విలువైన స్థలం కొట్టేయటం కోసం చేసిన పని తప్ప మరొకటి కాదు అని బిఆర్ఎస్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రా నాయకులు హైదరాబాద్ లో విలువైన స్థలాలు దోచుకుంటున్నారు అని ఆరోపించిన కెసిఆర్ ఇప్పుడు పార్టీ ఆఫీస్ లు, శిక్షణ కేంద్రాల పేరుతో హైదరాబాద్ లో అన్ని కలుపుకుని ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. బంజారా హిల్స్ లో ఉన్న తెలంగాణ భవన్ లో ఏడాది కి ఒక నెల రోజుల పాటు కార్యక్రమాలు జరిగితే గొప్ప. అలాంటిది శిక్షణ కార్యక్రమాల కోసం పదకొండు ఎకరాలు....పదిహేను అంతస్తుల భవనం అంటే ఇది అంతా దేనికోసమో ఊహించుకోవచ్చు. తెలంగాణ భవన్ ను కెసిఆర్ ఫ్యామిలి వ్యాపార అవసరాలకు వాడుకుంది అనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News