తెలంగాణ సర్కారు తీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆరోపించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. పోలీసులు తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమిని కెసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇవే ఫలితాలు రాష్ట్రం అంతా రిపీట్ అవుతాయని తెలిపారు. జె పీ నడ్డా మంగళవారం రాత్రి తెలంగాణ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ఉద్యోగులకు మద్దతు ఇవ్వటానికే తాను ఇక్కడకు వచ్చానన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇక్కడ వారసత్వ రాజకీయాలు సాగుతున్నాయన్నారు. ఉద్యోగులు, టీచర్లకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగానే బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారని..సంజయ్ పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించటంతోపాటు అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు.
బండి సంజయ్ పై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా తమ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కెసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసమే తెలంగాణ బిజెపి పోరాటం చేస్తుందని..వారికి తాను అండగా ఉంటానన్నారు. అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలో సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీకి నివాళులు అర్పించారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అందరూ పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా క్యాండిల్ ర్యాలీ లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్న బిజెపి కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్ ను విడుదల చేయాలని..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.