హారిక ఎవరో నాకు తెలియదు

Update: 2021-03-10 10:16 GMT

తెలంగాణ సర్కారు పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ వ్యవహారం ఇంకా దుమారం రేపుతూనే ఉంది. దేత్తడి హారిక నియామకంపై దుమారం రేగితే తాజాగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్ టీడీసీ) ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్ గా హారికనే ఉంటారని స్పష్టం చేశారు. 'తెలంగాణ ఆడబిడ్డ, కరీంనగర్‌ వాస్తవ్యురాలైన దేత్తడి హారికకు ప్రమోషన్‌ ఇచ్చేవిధంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించాం. మార్కెటింగ్‌లో ప్రమోషన్స్‌ కోసం హోటల్స్‌, బోటింగ్‌, బస్సులు నడవడానికి హారికను నియమించాం. కానీ ఎక్కడో మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల ఆమెను తొలగించారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి న‌మ్మొద్దు . దీని గురించే ఎండీ, మేమంతా కూర్చొని చర్చించాం. టూరిజాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌చారం చేస్తున్నాం. అందుకే హారికను తీసుకున్నాం.

అంతేగాని ఆమెను కోట్లు పెట్టి మేము తీసుకోలేదు. కోవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కాబట్టి హారికను పెడితే కొద్దీగా ప్రమోషన్‌ వస్తుందని మా ఆలోచన. ' అని పేర్కొన్నారు. ఈ తరుణంలో తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాసగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, తొందరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, త్వరలోనే ఒక మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News