Full ViewFull Viewహైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో విచిత్రమైన ట్రెండ్ కన్పిస్తోంది. అమ్మకాలు పెరిగాయి..అదే సమయంలో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య కూడా పెరిగింది. హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్ల సంఖ్య ఈ జూన్ నాటికి 82,220 కి పెరిగింది. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంతో పోలిస్తే రెండవ త్రైమాసికలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ ఇన్వెంటరీ అమ్ముడుపోవటానికి హైదరాబాద్ మార్కెట్లో అయితే ఏకంగా 37 నెలలు పడుతోంది. పొరుగునే ఉన్న కర్ణాటక రాజధాని నగరం బెంగుళూరులో అయితే అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య 70,530 మాత్రమే. అయితే ఇక్కడ ఇన్వెంటరీ ఉండే కాలం కూడా హైదరాబాద్ కంటే తక్కువగా 26 నెలలే కావటం మరో విశేషం. 2022 జూన్ నాటికి ముంబయ్ లో అత్యధికంగా 2,71,890 అమ్ముడుపోని యూనిట్లు ఉన్నాయి. దీని తర్వాత స్థానం పూణేది కాగా..ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్)లో 99,850గా ఉన్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ టైగర్ 2002 ఏప్రిల్-జూన్ కాలానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది.
ఇదే కాలంలో హైదరాబాద్ తోపాటు అహ్మదాబాద్ ల్లో అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మూడు నెలల కాలంలో హైదరాబాద్ లో అమ్మకాలు 7,910 యూనిట్లకు చేరాయి. ఇదే ఏడాది తొలి మూడు నెలల కాలంలో అమ్మకాల 6,560 యూనిట్లు మాత్రమే. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లో అమ్మకాలు కాస్త పుంజుకోవటం రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట కల్పించే అంశమే అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో హైదరాబాద్ లో యూనిట్ల సప్లయ్ కూడా పెరిగింది.ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో సప్లయ్ 14,570 యూనిట్లు ఉంటే....రెండవ త్రైమాసికంలో మాత్రం ఇది 16,480 యూనిట్లకు చేరింది. అయితే ఈ పెరుగుదల తాత్కాలికమేనా..ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అన్నది వేచిచూడాల్సిందే. అమ్మకాల ఒకింత పెరిగినా అమ్ముడుపోని యూనిట్లు భారీ స్థాయిలో ఉండటం ఈ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించే అంశమే.