అధికారిక పోస్టింగ్ ఒక చోట..అనధికారిక సేవలు అక్కడ!

Update: 2024-10-26 04:36 GMT

బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక వెలుగు వెలిగిన కలెక్టర్లలో ఆయన ఒకరు. జూనియర్ అయినా ప్రభుత్వ పెద్దలు ఏది చెపితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారనే..మరో కారణమో తెలియదు కానీ కీలక పోస్ట్ లు ఇచ్చారు. ఆయనపై గత ప్రభుత్వంలో ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కే లేదు. భూముల దందాతో ఆయన కూడా ఒక వైపు అప్పటి ప్రభుత్వ పెద్దలకు సాయం చేస్తూ మరో వైపు తాను కూడా బినామీ పేర్లతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి అలాంటి అధికారి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అలాంటిది ఏమి లేదు. రేవంత్ రెడ్డి సర్కారు లో నంబర్ టూ గా ప్రచారంలో ఉన్న మంత్రి ఒకరు ఆ అధికారిని తన సేవలకు ఉపయోగించుకుంటున్నట్లు సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఆ అధికారి అధికారిక పోస్ట్ ఒకటి..కానీ ఐఏఎస్ చేసే పని మాత్రం మరొకటి. గత అనుభవాలను ఉపయోగించి ప్రస్తుత మంత్రికి కూడా తన వంతు సాయం అందిస్తున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అత్యంత కీలకమైన ఫైల్స్ విషయంలో ఆయన మంత్రికి ఓఎస్ డి గా పని చేస్తున్నారు అని చెపుతున్నారు.

                                         ఇదే ఇప్పుడు అధికార వర్గాల్లో కూడా చర్చ కు కారణం అవుతోంది. ఆయన సూచనల మేరకే ఫైల్స్ కదలికలు సాగుతున్నాయి అంటే ఆయన సదరు మంత్రి దగ్గర ఎంత ప్రాధానత్య దక్కించుకున్నారో ఊహించుకోవచ్చు. ఇవన్ని పక్కన పెడితే ఆ మంత్రి కూడా గత ప్రభుత్వం తరహాలోనే కీలక ఫైల్స్ విషయంలో ముందుకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవి కాకుండా సచివాలయం వెలుపల కూడా పలు ప్రైవేట్ ఆఫీసులు పెట్టి రిటైర్ అయిన అధికారులను పెట్టుకుని పెద్ద ఎత్తున ఒక వ్యవస్థను నడుపుతున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. కలెక్టర్ గా పని చేసిన వ్యక్తిని అనధికారికంగా ఫైల్స్ కియరెన్సు కు ఉపయోగించుకోవటం...బయట పలు ఆఫీస్ లు తెరవటం అంటే భారీ ఎత్తున డీల్స్ జరుగుతున్నట్లు చెపుతున్నారు. ఇది ఎక్కడికి వెళుతుందో వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News