వరస ప్రకటనలపై మంత్రుల ఆగ్రహం !

Update: 2024-11-04 04:57 GMT

తెలంగాణ అధికారిక సీఎం రేవంత్ రెడ్డి. కానీ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారా?. అన్ని శాఖల విషయాలపై అయన మీడియా ముందు ప్రకటనలు చేస్తూ ఇతర క్యాబినెట్ మంత్రులకు చికాకు కలిగిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కొంత మంది మంత్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రతి విషయంలో అంటే..ఆయనకు సంబంధము లేని శాఖల విషయాల్లో కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న ప్రకటనలు క్యాబినెట్ మంత్రుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. దీపావళికి ముందే తెలంగాణ లో రాజకీయ బాంబు లు పేలతాయి అంటూ దక్షిణ కొరియా పర్యటనలో వ్యాఖ్యానించి ఆయన ప్రభుత్వ పరువు తీశారు అని ఒక సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అది కాస్తా తుస్ అనటంతో ఇప్పుడు మాత్రం డేట్ మారొచ్చు..కానీ పేలటం ఖాయం అని కొత్త కలరింగ్ ఇస్తున్నారు.

                                                                      అలాంటప్పుడు ముందే అంతా రెడీ అయిపోయినట్లు...సరిగ్గా ఏ తేదీల్లో పేలతాయో తెలియనప్పుడు తేదీలు ఎందుకు చెప్పినట్లు అన్నది ఆ నాయకుల మాట.               స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పిన రాజకీయ బాంబుల విషయం ఏంటో తనకు తెలియదు అన్నారు. తాము ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తామని చెప్పారు. రాజకీయ బాంబు ల విషయంలో పరువు పోగొట్టుకున్న పొంగులేటి వరసగా చేస్తున్న ప్రకటనలు కూడా కాంగ్రెస్ నేతలను షాక్ కు గురి చేస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ సర్కారు బిసి కులగణనకు అరవై రోజుల గడువు అంటే రెండు నెలలు పెట్టుకుంది. ఈ నివేదిక చేతికి రావాలి...తర్వాత రిజర్వేషన్స్ ఖరారు కావాలి. ఎన్నికలు జరగాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మొత్తం వ్యవహారం రెడీ కావటానికి జనవరి నెలాఖరు వరకు సమయం పడుతుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాత్రం వచ్చే సంక్రాంతి నాటికే గ్రామాల్లో కొత్త సర్పంచులు వస్తారు అని చెప్పుకొచ్చారు.

                                                     ఇది జరిగే పనేనా అన్న సందేహాలు కాంగ్రెస్ నేతల్లోనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరంగల్ ను రాష్ట్రంలో రెండవ రాజధానికి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరో వైపు భద్రకాళి ఆలయానికి సంబంధించిన అంశాలపై కూడా పొంగులేటి పలు ప్రకటనలు చేశారు. రాబోయే రోజుల్లో పొంగులేటి వ్యవహారం ఖచ్చితంగా క్యాబినెట్ లో దుమారం రేపటం ఖాయం అని ఒక మంత్రి తెలిపారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో ఆయన ఒక ప్రాంతీయ పార్టీ లో వ్యవహరించినట్లు అంతా నా ఇష్టం అన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవిన్యూ తో పాటు హౌజింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖలు కూడా చూస్తున్నారు. క్యాబినెట్ సమావేశాల అప్పుడు అన్ని శాఖల వివరాలు ఆయన మీడియా సమావేశంలో వెల్లడిస్తారు. అలాగే ఇప్పుడు బయట కూడా ఆయనే అన్ని శాఖల విషయాలు మాట్లాడితే ఆయా శాఖల మంత్రులు ఏమి చేయాలని ఒక సీనియర్ మంత్రి సందేహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News