మా పాత కేసు లు తీస్తే..మీ కొత్త స్కాంలు చెపుతాం అని బెదిరింపా!

Update: 2024-11-12 07:08 GMT

కేటీఆర్ వణుకుడు ట్వీట్ కామెడీ లా ఉందంటూ కామెంట్స్ 

తెలంగాణ లో అమృత్ టెండర్ల కేటాయింపుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు కొత్తగా చెపుతుంది ఏమీ లేదు. ఇవే ఆరోపణలు ఆయన గత కొన్ని నెలలుగా చేస్తూనే ఉన్నారు. ఇదే అంశంపై మీడియా ముందు...ఎక్స్ వేదికగా కూడా పలు మార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే అంశంపై ఆగమేఘాల మీద కేటీఆర్ ఢిల్లీ పర్యటన తలపెట్టడం..కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేయటం వెనక కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ లోని రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఫార్ములా రేసింగ్ రేస్ ఒప్పందం విషయంలో చేటుచేసుకున్న అక్రమ చెల్లింపులు..నిబంధనల ఉల్లంఘనపై చర్యలకు సిద్ధం అవుతున్న వేళ ఇక్కడ చెప్పి చెప్పి అరిగిపోయిన రికార్డు లనే మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ లో చెప్పారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంలో అక్రమాలు జరిగితే ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేయటం తప్పేమికాదు..అది ఆ పార్టీ బాధ్యత కూడా. కానీ ఇప్పుడు ఢిల్లీ లో కేటీఆర్ చెప్పిన విషయాలు కొన్ని నెలల ముందే ఇక్కడ చెప్పి చెప్పి ఉన్నవే.

                                                                   ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేయాలి అనుకుంటే విషయం తెలిసిన వెంటనే ఆ పని చేస్తారు. కానీ ఢిల్లీలో కేంద్ర మంత్రి ని కలవటానికి ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదే ఇక్కడ పాయింట్. ఈ వ్యవహారం మొత్తం ఎలా ఉంది అంటే మా పాత కేసులు అన్ని తవ్వి తీస్తుంటే..మేము మీ మీద ఢిల్లీ లో ఫిర్యాదు చేస్తాం చూసుకోండి అన్నట్లు కేటీఆర్ తీరు ఉంది అన్న చర్చ సాగుతోంది. కేటిఆర్ పై ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు ల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. అందుకే వీటికి కౌంటర్ గా ఢిల్లీ వెళ్లి..ఇది ఒక్కటే కాదు..ఇంకా చాలా ఉన్నాయి..ఇక ఢిల్లీ వస్తాం...స్కాం ల గురించి చెపుతూనే ఉంటాం అని కేటీఆర్ ప్రకటించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సాగిన కాళేశ్వరం, మిషన్ భగీరధ, ధరణి స్కాం లో పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే...ఆధారాలు ఉంటే చూపించండి...చేతనైతే కోర్ట్ లకు వెళ్ళండి. మీకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లు కెసిఆర్, కేటీఆర్ లు వ్యవహరించిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ తన పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జీఓ ల వెబ్ సైట్ లో ఎలాంటి వివరాలు పెట్టకుండా చేశారు.

                                                              ఒక్క మాటలో చెప్పాలంటే పారదర్శకతకు పాతర వేశారు. బిఆర్ఎస్ హయాంలో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా నడిపించారు అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. జీవో ల విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే మోడల్ ఫాలో అవుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మా పాత కేసు ల్లో మీరు స్పీడ్ పెంచితే మీ కొత్త కేసు ల ను ఇక వెలుగులోకి తెస్తాం అన్న చందంగా కేటీఆర్ మాటలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రికి అలా ఫిర్యాదు చేసిన గంటల్లోనే తెలంగాణ లో రేవంత్ రెడ్డి పదవి పోతుంది అనే లెవల్ లో కేటీఆర్ ఢిల్లీ లో తాను ల్యాండ్ కాగానే అప్పుడే వణికితే ఎలా అంటూ చేసిన ట్వీట్ మరీ కామెడీ గా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్వయంగా బిఆర్ఎస్ నాయకులు కూడా ఇది మరీ అతిగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ట్వీట్లతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అని వ్యాఖ్యానిస్తూన్నారు. 

Tags:    

Similar News