భారీ వర్షం హైదరాబాద్ లో ఒక చిన్నారి ప్రాణం పోవటానికి కారణం అయింది. వర్షం కారణంగా అనటం కంటే జీహెచ్ఎంసి నిర్లక్ష్యం అనటమే కరెక్ట్. పాల ప్యాకెట్ తీసుకురావటానికి అని బయటకు వెళ్లిన చిన్నారి ఓపెన్ చేసి ఉన్న మ్యాన్‌హోల్ లో పడి మృతువాత పడింది. శనివారం ఉదయం నుంచే నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసి రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. దీంతో మ్యాన్‌హోల్స్‌లో నుంచి నీరు పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో మౌనిక అనే చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా... పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.
మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసి సమన్వయ లోపం వాళ్ళ ఈ దారుణం జరిగింది అని వెల్లడించారు. ఇందుకు బాద్యులు అయినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా చేయటం వాళ్ళ తర్వాత అయినా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారన్నారు. గతం లో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదం లేకుండా చేస్తామని ప్రకటించారు. ప్రకటనలు అయితే చేస్తున్నారు కానీ...ఎప్పుడూ మళ్ళీ అవే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.