హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఐటి రంగం పిడుగు !

Update: 2023-01-08 07:58 GMT

Full Viewఐటి రంగం, రియల్ ఎస్టేట్. ఈ రెండు ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్న రంగాలు. ఒక దాని ప్రభావం మరో దానిపై ఉంటుంది అనే విషయం తెలిసిందే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఈ స్థాయిలో దూసుకు వెళ్ళింది అంటే ఇందులో ప్రధాన పాత్ర ఐటి రంగానిదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు ఐటి స్పేస్ తో పాటు మరో వైపు ఇళ్ళు, అపార్టుమెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. అయితే వచ్చే రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఐ టి రంగం తీవ్ర సవాళ్లు ఎదుర్కొనుంది. ఇటీవల ఈ విషయాన్ని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా వెల్లడించారు. అయితే దీనికి ప్రధాన కారణం పలు దేశాలు మాంద్యం బారిన పడనుండటమే అని తెలిపారు. రెండేళ్ల తర్వాత మాత్రం ఐటి రంగం ఎవరూ ఊహించని స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతుంది అని వెల్లడించారు. కారణం ఏదైనా రెండేళ్లు మాత్రం ఐటి రంగం గడ్డు కాలాన్ని చవిచూడనుంది.

                                     ఇప్పటికే 2022 లో టెక్ కంపెనీలు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉద్యోగులను తొలగించాయి. కొత్తగా ప్రముఖ సంస్థ సేల్స్ ఫోర్స్ కూడా తమ సిబ్బందిలో పది శాతం అంటే 8000 మందిని తొలగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అమెజాన్ కూడా ఏకంగా 18000 వేల మందిని తొలగించనుంది. అందులో ఇండియా నుంచి ఒక 1000 మంది ఉద్యోగాలు ప్రమాదం లో పడబోతున్నాయి. 2023 లో కూడా ఐటి ఉద్యోగులు తొలగింపు...కొత్త ఉద్యోగాల స్పీడ్ తగ్గే అవకాశం ఉండటం తో ఈ ప్రభావం ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రతికూలంగానే ఉంటుందని చెపుతున్నారు. ఒకటి ఐటి రంగం సవాళ్లు. మరొకటి మాంద్యం, మూడవ అంశం ఎన్నికల ఏడాది అన్ని కలిపి రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయం అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా అధిగమిస్తాయో చూడాలి.

Tags:    

Similar News