2022 మార్చిలో తప్పదంటున్న నిపుణులు
పేరుకుపోతున్న అపార్ట్ మెంట్ ఇన్వెంటరీ
గత కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బూమ్..బూమ్ తప్ప మరో మాటలేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అయితే రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇది అంతా ప్రైవేట్ వ్యవహారం కాబట్టి ప్రభుత్వం నియంత్రించటం అనేది కూడా జరిగే పనికాదు. విచిత్రం ఏమిటంటే దేశంలోనే ఐటి రాజధానిగా పేరుగాంచిన బెంగుళూరులో నే హైదరాబాద్ కంటే తక్కువ ధరకు అపార్ట్ మెంట్లు దొరుకుతాయి. కానీ హైదరాబాద్ మార్కెట్ మాత్రం అలా కాదు. కరోనా కష్టకాలంలోనూ ఏదో కొద్దిరోజుల తప్ప మార్కెట్ పెద్దగా తగ్గింది లేదు. అయితే వచ్చే మార్చి నాటికి హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలుతుంది అంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక 'డెక్కన్ క్రానికల్' సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రతినిధి ఎస్. ఉమామహేశ్వర్ రియల్ రంగంలోని ప్రముఖులు..రియల్ ఎస్టేట్ రంగాన్ని అధ్యయనం చేసే ఏజెన్సీలతో మాట్లాడి ఈ కథనాన్ని అందించారు. ఈ కథనంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఈ మార్కెట్ పతనానికి ప్రీ లాంచ్ ఆఫర్లు కారణం కాబోతున్నాయని ఈ రంగంలోని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆఫర్లు చూడటానికి ఎంతో ఆసక్తికరంగా..ఆకర్షణీయంగా ఉన్నా ఎక్కడైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుందని.వీటికి ఎలాంటి రక్షణా ఉండదని చెబుతున్నారు. ఈ ఆఫర్ల లాభదాయకత, తట్టుకునే శక్తి వంటి అంశాలను చూసి ఈ రంగంలోని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నాటికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలుతుందని సుచిర్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ డాక్టర్ వై కిరణ్ తెలిపారు. గతంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎవరైతే ఇంట్లో ఉందామని అనుకుంటున్నారో వాళ్లే కొనుగోళ్ళు జరిపేవారని..కానీ ఇప్పుడు ఈ మార్కెట్లోకి స్పెక్యులేటర్లు వచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రీ లాంచ్ ఆఫర్లలోకి స్పెక్యులేటర్లు ప్రవేశిస్తున్నారని..బిల్డర్ ప్రాజెక్టు పూర్తి చేసినా..ఆ సమయానికి మార్కెట్లో అమ్మకాలు జరిపేందుకు అప్పటి ధరల ప్రకారం అవసరమైన కొనుగోలుదారులు అందుబాటులో ఉండరన్నారు.
ఇదిలా ఉంటే ఈ సెప్టెంబర్ 30 నాటికి నగరంలో 58,535 అమ్మకం కాని ఫ్లాట్లు (ఇన్వెంటరీ)తో బిల్డర్లు ఉన్నట్లు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. జూన్ లో ఈ ఇన్వెంటరీ 50580గా ఉంది. అంటే జులై-సెప్టెంబర్ కాలంలోనే కొత్తగా 8000 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇదే సమయంలో 6735 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇప్పటికే ఓవర్ సప్లయ్ మార్కెట్ అయిపోయిందని ఈ లెక్కలు చెబుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఇన్వెంటరీ ఉన్న మార్కెట్ గా హైదరాబాద్ నిలిచింది. గత కొంత కాలంగా నగరంలో కొత్త వెంచర్లు కూడా భారీ ఎత్తున వస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. మార్కెట్లో కరక్షన్ కు ఛాన్స్ ఉందని క్రెడాయ్ క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షడు సి. శేఖర్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రీ లాంచ్ ఆఫర్లు రియల్ ఎస్టేట్ నియంత్రణా సంస్థ (రెరా) నిబంధనలను ఉల్లంఘించటమే అన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరల సర్దుబాటు ప్రతి పదేళ్లకు జరిగే పనేనని..అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం కష్టం అని కుష్ మాన్ అండ్ వేక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరక్టర్ వీరబాబు తెలిపారు. అయితే 2008 నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్ మార్కెట్లో కరెక్షన్ లేదన్నారు.