'ఫస్ట్ థింగ్ నేను దేవుడిని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవి రాకూడదను అని. లాస్ట్ టైమ్ అట్లా అయింది.' అంటూ హైదరాబాద్ నూతన మేయర్ గద్వాల విజయలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది హైదరాబాద్ లో వచ్చిన వర్షాలు, వరదలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది..హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు అని మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే ఆమె ఏకంగా ఐదేళ్ల పాటు వర్షాలు రాకూడదని భగవంతుడిని మొక్కుతాను అంటూ వ్యాఖ్యానించటం షాక్ కు గురిచేసింది.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. కొద్ది కాలం కిందటే ఆమె ఓ తహశీల్దార్ విషయంలో అనుచితంగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. అయినా సరే టీఆర్ఎస్ అధిష్టానం అదేమి పట్టించుకోకుండా మేయర్ పదవి కట్టబెట్టింది. అంతే కాదు..ఆమె మేయర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ తహశీల్దార్ ను కూడా అక్కడ నుంచి తప్పించటం పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు మేయర్ వరదలు రాకూడదని ఏకంగా హైదరాబాద్ లోనే వర్షాలు కురవొద్దని కోరుకోవటం విచిత్రంగా..వింతగా కూడా ఉంది.