ఎన్నికల ఏడాది లోనూ రియల్ ఎస్టేట్ మార్కెట్ జోష్

Update: 2023-09-29 07:41 GMT

Full Viewహైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎన్నికల ఏడాది కూడా అమ్మకాలు ఏ మాత్రం తగ్గినట్లు కనిపించటం లేదు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు...దేశంలోని ఏడు కీలక నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నగరాల్లో హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఉంటాయి. 2023 సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో ఈ ముఖ్యమైన నగరాల్లో అమ్మకాలు ఏకంగా 36 శాతం మేర పెరిగి...120280 యూనిట్లకు చేరాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ ఈ విషయాలను తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే కాలంలో హైదరాబాద్ మార్కెట్ లో అమ్మకాలు 41 శాతం మేర పెరిగి 16375 యూనిట్స్ కు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో అంటే 2022 జులై-సెప్టెంబర్ కాలంలో అమ్మకాలు 11650 యూనిట్స్ గా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ ఐటి నగరం బెంగళూరు లో అయితే అమ్మకాలు 29 శాతం మేర పెరిగి 16395 యూనిట్స్ కు చేరాయి. గత ఏడాది ఈ అమ్మకాలు 12690 యూనిట్స్ మాత్రమే. దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ధరలు పదకొండు శాతం పెరిగితే హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం ధరల పెరుగుదల 18 శాతం ఉండటం విశేషం. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రీమియం ఇళ్ల సెగ్మెంట్ లోనే పెరుగుదల ఉన్నట్లు చెపుతున్నారు.

దేశంలో ఎక్కువ అమ్మకాలు నమోదు అయిన ప్రాంతాలుగా ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ (ఎంఎంఆర్) , పూణే లు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో అమ్మకాల్లో పెరుగుదల ఆరు శాతం మాత్రమే నమోదు అయింది. ఇక్కడ జులై -సెప్టెంబర్ కాలంలో 15 ,865 యూనిట్స్ విక్రయించారు. ఎంఎంఆర్ రీజియన్ లో అమ్మకాలు 46 శాతం పెరుగుదలతో 38500 యూనిట్స్ కు చేరాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అని అనరాక్ అంచనా వేస్తోంది. ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో అమ్మకం కాకుండా ఉన్న అపార్ట్ మెంట్ లు ఏకంగా లక్ష వరకు ఉన్నట్లు రిపోర్ట్ లు బయటకు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు ఎన్ని అమ్ముడు అయింది తేలాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్ లోనే పూర్తి కానున్నాయి. మరి వచ్చే మూడు నెలల కాలంలో అమ్మకాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి. 

Tags:    

Similar News