కృష్ణా జలాల పరిరక్షణ కంటే ముఖ్యమంత్రి కెసీఆర్ కు పెద్ద పనులు ఏమున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 9న నిర్వహించనున్న కెఆర్ ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. కెసీఆర్ బిజీగా ఉంటే సీనియర్ మంత్రిని సమావేశానికి పంపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు తెలంగాణకు 34 శాతం కృష్ణా జలాలు చాలు అని సంతకం పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు మాత్రం 50 శాతం నీటిని కోరుతామని అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ తెచ్చిన జీవోపై తాము ఫిర్యాదు చేస్తే కేసీఆర్ కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లకుండా ఎందుకు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేసీఆర్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ సర్కారు జీవో 203 తెచ్చిన సమయంలో..ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు కెసీఆర్ మౌనంగా ఉన్నారన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చిన కెసీఆర్ నీటి విషయంలో ఎందుకు కేంద్రాన్ని నిలదీయటం లేదన్నారు.