తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హఫీజ్ పేట భూ వివాదానికి సంబంధించి పోలీసులు మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి భూమి అఖిలప్రియ అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. తాజా అరెస్ట్ లకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆదివారం నాడు మీడియాకు వెల్లడించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో.. మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మాదాల సిద్దార్థ అండ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామన్నారు. అఖిలప్రియకు మాదాల సిద్దార్థ కిడ్నాప్ గ్యాంగ్‌ను సప్లై చేశాడని చెప్పారు. '' మాదాల సిద్దార్థ విజయవాడలో ఈవెంట్ మేనేజర్. అతడు తన స్విఫ్ట్ కారును కూడా కిడ్నాప్‌కు ఇచ్చాడు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయ్యారు. సిద్దార్థకు అఖిలప్రియ రూ.5 లక్షల సుపారీ ఇచ్చారు. మిగతా 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చారు. అడ్వాన్స్‌గా సిద్దార్థకు రూ.74 వేలు ఇచ్చారు. ఫోరమ్ మాల్ వద్ద ఎట్‌హోమ్‌లో కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాపర్లకు గుంటూరు శ్రీను దుస్తులు సమకూర్చాడు. మొయినాబాద్‌లో బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. స్టాంప్ పేపర్లను మల్లికార్జున్ సంపత్ అరేంజ్ చేశాడు. జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ పేర్లపై ఖాళీ పత్రాలు ఉన్నాయి. కిడ్నాప్‌లో విఖ్యాత్ ఇన్నోవా కారు ఏపీ 21 సీకే 2804 వినియోగించారు. విఖ్యాత్ కారులో భార్గవ్‌రామ్, మరో నలుగురు నిందితులు ఉన్నారు.
భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ ప్రధాన నిందితులు. శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నార''ని వెల్లడించారు. ''ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నాం. జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ కోసం వెతుకుతున్నాం. హైదరాబాద్ లోథా అపార్ట్ మెంట్‌లోనే కిడ్నాప్ ప్లాన్ చేశారు. ఫోరంమాల్ ఎట్‌హోం లాడ్జిలో కిడ్నాప్‌కు సంబంధించిన ముఠాను ఉంచారు. కిడ్నాప్‌కు కావాల్సినవన్నీ గుంటూరు శ్రీను సమకూర్చాడు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో బాధితుల నుంచి నిందితులు స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. 5 సిమ్‌కార్డులు, ఒక బొమ్మ పిస్టల్ కొనుగోలు చేశారు. బాధితుల ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. 5 వాహనాల్లో మల్లికార్జున నగర్‌కు నిందితులు వచ్చారు. సన్‌సిటీ ఓఆర్‌ఆర్ వద్ద బాధితులను విడిచిపెట్టారు'' అని నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ తెలిపారు.