ఓ జర్నలిస్టు ఈ రోజు నేను పది వార్తలు రాశాను అంటే అందులో వింత ఏముంటుంది. వార్తలు రాయటం అనేది జర్నలిస్టు పని. ఓ ఆఫీసర్ ఈ రోజు నేను ఈ రోజు పది ఫైళ్లు క్లియర్ చేశాను..ట్రాఫిక్ లో కూడా ఆఫీసుకు వచ్చాను అంటే ఎవరికైనా అందులో కొత్తదనం కానీ..చెప్పుకోవాల్సింది కానీ ఏముంది అన్పిస్తుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ చేసిన ట్వీట్లు కూడా ఇదే తరహా చర్చకు కారణం అవుతున్నాయి. మంత్రి కెటీఆర్ ట్వీట్లు చూసి అధికారులు, ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన కాలికి దెబ్బతగిలింది..మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని చెబుతూ ట్వీట్ చేశారు. వెంటనే అందరూ మంత్రి కెటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే ట్వీట్ లో ఓటీటీలో మంచి షోల గురించి చెప్పాలంటూ కోరారు. ఇదే దుమారానికి కారణం అయింది. వర్షాలకు హైదరాబాద్ తోపాటు తెలంగాణలో పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు ఓటీటీలో షోలు సజెస్ట్ చేయాలా?. ఇదే మీకు ముఖ్యమా అంటూ పార్టీలకు చెందిన నేతలతోపాటు నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు చేశారు.
దెబ్బ కారణంగా కెటీఆర్ ఇంట్లో కూర్చుని ఎన్ని సినిమాలు చూసినా ఎవరికీ తెలియదు..తెలిసే అవకాశమే లేదు. కేవలం ట్వీట్ లోని ఒక్క లైన్ కారణంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజంగా కెటీఆర్ కు మంచి సినిమాలు...వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన ఇలా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తొలి ట్వీట్ లాగానే మంగళవారం నాడు మంత్రి కెటీఆర్ మరో ట్వీట్ చేశారు. వర్క్ ఫ్రం హోం అంటూ కొన్ని ఫైళ్ల పని చూసినట్లు రాశారు. నిజానికి ఇందులో ఇందులో అసాధారణమైన అంశం ఏమీలేదు. మరి దీనికి ట్వీట్ చేయటం ఎందుకు..విమర్శలు కొని తెచ్చుకోవటం ఎందుకు అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయటంలో వింత ఏముంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఓ పార్టీ నాయకుడు కూడా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా అసాధారణ పనులు చేసినప్పుడు చెప్పుకోవటం..దాని నుంచి మైలేజ్ తీసుకోవటం తప్పుకాకపోయినా..చేయాల్సిన పని చేస్తూ కూడా అదేదో వింత లాగా చెప్పుకోవటం ఓ ట్రెండ్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.