హైదరాబాద్ నగర మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన విజయలక్ష్మిని మేయర్‌గా, శ్రీలతని డిప్యూటీ మేయర్‌గా ఈ నెల 11న ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే మంత్రి కెటీఆర్ కేశవరావు నివాసానికి వెళ్లి మేయర్ విజయలక్ష్మీకి అభినందనలు తెలిపారు. బొంతు రామ్మోహన్ మేయర్ గా ఉన్న సమయంలో అంతా తానై వ్యవహారించిన మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ఇప్పుడు మేయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. గద్వాల విజయలక్ష్మీ ని మేయర్ గా ఎంపిక చేయటం పూర్తిగా సీఎం కెసీఆర్ ఛాయిస్ అని...కెటీఆర్ ఇందుకు విముఖత చూపారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.