పదవీ పోయింది. పరువు పోయింది. ఇదీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ సెక్రటరీ మురళీ ముకుంద్ తీరు. గెలిచిన ప్యానల్ కు కాకుండా ప్రత్యర్ధుల శిబిరంలో చేరి నమ్ముకున్న వారిని నట్టేట ముంచేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు రివర్స్ కొట్టాయి. ఏకంగా పాలకమండలి లేకుండా స్పెషల్ ఆఫీసర్ పాలన తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు వికటించి చివరకు ఆయనకు దక్కిన సెక్రటరీ పదవికే ఎసరు తెచ్చుకున్నారు. కమిటీ పాలక మండలి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమోదించటంతో మురళీ ముకుంద్ కార్యదర్శి పదవి కూడా పోయింది. అయితే ఆయన దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో కొత్త చిక్కు వచ్చిపడింది. ఓ వైపు పదవి పోయి కష్టాల్లో ఉన్న ఆయనకు కొత్త చిక్కు వచ్చి పడింది.
సొసైటీకి చెందిన కీలక ఫైళ్లు మాయం చేయటంతోపాటు కోర్టులో ఉన్న శిరీష కేసును కమిటీతో సంబంధం లేకుండా ఉపసంహరించుకున్నందుకు ఆయనపై సొసైటీ ప్రెసిడెంట్ బి. రవీంద్రనాధ్ గత నెలలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మురళీముకుంద్ తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ పై తాజాగా ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. ఎఫ్ ఐఆర్ 487 లో వీరిపై ఐపీసీలోని సెక్షన్లు 406, 420, 506 కింద నమోదు చేశారు. ఇందులో మురళీ ముకుంద్ ఏ1గా ఉంటే, చంద్రశేఖర్ ఏ2గా ఉన్నారు. దీంతో ఈ మొత్తం ఈ వ్యవహరం రసకందాంలో పడింది. మరి ఇప్పుడు మురళీ ముకుంద్ ను గత కమిటీలోని అక్రమార్కులు కాపాడే ప్రయత్నం చేస్తారా లేక ఆయన మానాన ఆయన్ను వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.