కెసీఆర్ పై మాజీ ఐపీఎస్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Update: 2021-08-23 12:18 GMT

అవినీతిలో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ చేశారు

సంచ‌లనం. మాజీ ఐపీఎస్ అధికారి వీ కె సింగ్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్రానికి చేసింది ఏమీలేద‌ని..దేశంలోనే అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ గా చేశార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తాను త్వరలోనే బయట పెడతానని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ''7 ఏళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను 7 నెలల్లో ప్రజలకు చూపిస్తాను. సర్కార్ వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను.

'జన సేవ సంఘ్' స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తాను'' అని వీకే సింగ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ని ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్స్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని అన్నారు. గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. జైళ్లలో ఎక్కువ శాతం మంది ఎలాంటి నేరాలు చేయని బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వీకే సింగ్ విమర్శించారు.

Tags:    

Similar News