
రాజకీయ పోరాటం ..ఇప్పుడు న్యాయపోరాటం వైపు మళ్ళింది. ఈటెల రాజేందర్ కుటుంబం సర్కారు చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వివాదం వ్యవహారంలో జమున హ్యాచరీస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కలెక్టర్ నివేదిక తప్పులతడకగా ఉందంటూ పేర్కొంది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని జమున హ్యాచరీస్ పిటిషన్‌లో కోరింది. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్‌లో పేర్కొంది.
తమ భూముల్లో జోక్యం చేసుకోకుండ చూడాలని, బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు.