కీలక పరిణామం. గురువారం నాడు ఢిల్లీ లో ఈడీ ముందు హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరు కాలేదు. ఆమె తన తరపున పలు అంశాలను లేవనెత్తుతూ ఈడీకి లేఖ రాయటం తో పాటు సుప్రీం కోర్ట్ లో తన కేసు మార్చి 24 న ఉన్నందున అప్పటివరకు విచారణకు హాజరు కాలేను అంటూ సమాచారం ఇచ్చారు. ఆదే సమయంలో ఈడీ కోరిన కొంత సమాచారాన్ని కూడా లేఖ తో పాటు అందచేశారు. కవిత లేఖను పరిశీలించిన తర్వాత ఈడీ మరోసారి ఆమెకు మార్చి 20 న కచ్చితంగా హాజరు కావాలని నోటీసు లు జారీచేశారు. ఒక వైపు ఆమె మార్చి 24 వరకు రాను అని చెప్పగా...ఈడీ మాత్రం మార్చి 20 న హాజరు కావాలని నోటీసు జారీ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏమి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇప్పటిలాగానే మార్చి 20 న కూడా లేఖ రాస్తారా...లేక ఈ లోగా మరో సారి సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించటం, లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేయటం వంటి ఆప్షన్స్ ఉంటాయని న్యాయ నిపుణులు చెపుతున్నారు.
మార్చి 20 న కూడా కవిత విచారణకు హాజరు కాకపోతే ఈడీ అధికారులు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఆధారముగా లీగల్ ఒపీనియన్ తో ముందుకు వెళతారని ఒక న్యాననిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇది ఇలా ఉంటే ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కానీ అంశాన్ని ఈడీ ప్రస్తావించింది. కవిత ను...రామ చంద్ర పిళ్ళై ని కలిసి విచారించాల్సి ఉన్నందున పిళ్ళై కస్టడీ పొడిగించాలని కోరారు. అయితే అందరిని కలిపి విచారించాల్సిన అవసరము ఏమి ఉంది..డాకుమెంట్స్ ఆధారంగా విచారణ జరపవచ్చుగా అని కోర్టు ప్రశ్నించింది. ఈడీ రామచంద్ర పిళ్ళై ని ఐదు రోజులు కస్టడీ కి అడగ్గా మూడు రోజులు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్ట్. దీంతో పాటు మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. మర్చి 18 న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసు లో అయన తనయుడు రాఘవ రెడ్డి అరెస్ట్ అయి జైలు లో ఉన్నారు.
.