కెసిఆర్ కుమార్తె కు ఈడీ నోటీసులు

Update: 2023-03-08 03:44 GMT

కీలక పరిణామం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కు ఈడీ నోటీసులు జారీచేసింది. మార్చి 9 న ఢిల్లీ లో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కెసిఆర్ కుమార్తె కవిత అరెస్ట్ తప్పదనే చర్చ సాగుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కాం లో ఇప్పటికే కవిత పేరు పలు సందర్భాల్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కు సంబదించిన ఆధారాలు దొరక్కుండా కవిత పది ఫోన్లను ద్వంసం చేసినట్లు ఈ కేసు చార్జిషీట్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ లో కవిత నివాసం తో పాటు...ఢిల్లీ లోని హోటల్ లో కూడా కవిత లిక్కర్ పాలసీ ఖరారు సమావేశాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే సిబిఐ ఒకసారి కవిత ను ఆమె నివాసం లో ఇదే స్కాం పై విచారించింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగటంతో అరెస్ట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఈడీ లిక్కర్ స్కాం లో అరుణ్ రామచంద్ర పిళ్ళై ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయన రిమాండ్ రిపోర్ట్ లో రామచంద్ర పిళ్ళై కవిత బినామీ అని ఈడీ స్పష్టం చేసింది. ఈ విషయం ఆయనే చెప్పారని..కవిత ప్రయోజనాల కోసం తాను ఇందులోకి అడుగుపెట్టినట్లు అయన వెల్లడించారు అని తెలిపింది. రామచంద్ర పిళ్ళై అరెస్ట్ జరిగిన వెంటనే కవిత కు నోటీసులు ఇవ్వటం తో ఇష్యూ క్లైమాక్స్ కు చేరినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ స్కాం లో చాలామందిని అరెస్ట్ చేశారు. దీంతో ఇక నెక్స్ట్ కవిత వంతు అనే చెపుతున్నారు. బీజేపీ నేతలు కూడా గత కొంత కాలంగా త్వరలోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఉంటుంది అని చెపుతున్న విషయం తెలిసిందే. మరి ఢిల్లీ లో గురువారం నాడు కవిత విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో లిక్కర్ స్కాం లో ఉన్న వాళ్ళు అంతా తనకు తెలిసిన వాళ్ళు..స్నేహితులు అని కవిత వెల్లడించారు.

Tags:    

Similar News